Google AI: ఇక తెలుగులోనే గూగుల్ ఏఐతో సంభాషణ... అందుబాటులోకి కొత్త ఫీచర్లు

Google AI Expands to Telugu and 6 Other Indian Languages
  • గూగుల్ సెర్చ్‌లో తెలుగుకు పెద్దపీట
  • ఏఐ మోడ్‌లో అందుబాటులోకి ఏడు భారతీయ భాషలు
  • ఇకపై తెలుగులోనే సంక్లిష్ట ప్రశ్నలు అడిగే వెసులుబాటు
  • వాయిస్, కెమెరాతో 'సెర్చ్ లైవ్' అనే కొత్త ఫీచర్
  • అమెరికా తర్వాత ఈ ఫీచర్ అందుకున్న తొలి దేశం భారత్
టెక్ దిగ్గజం గూగుల్, భారతీయ వినియోగదారులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభూతిని తెలుగు సహా ఏడు కొత్త భారతీయ భాషల్లోకి విస్తరిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మార్పుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తమకు నచ్చిన భాషలో మరింత సులభంగా, లోతైన సమాచారాన్ని పొందగలుగుతారు.

ఇప్పటివరకు కేవలం ఇంగ్లిష్, హిందీ భాషలకే పరిమితమైన ‘ఏఐ మోడ్’ సేవలు ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా వినియోగదారులు సంక్లిష్టమైన అంశాలపై సుదీర్ఘమైన, సంభాషణ రూపంలో ప్రశ్నలు అడిగి వివరమైన సమాధానాలు పొందవచ్చని గూగుల్ తెలిపింది. స్థానిక భాషల నుడికారాలను, సూక్ష్మ వ్యత్యాసాలను అర్థం చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన జెమిని మోడల్‌తో ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ వివరించింది. రాబోయే వారంలో ఈ కొత్త భాషలు అందరికీ అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

ఈ భాషల విస్తరణతో పాటు, గూగుల్ ‘సెర్చ్ లైవ్’ అనే మరో అద్భుతమైన ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. వాయిస్, కెమెరా ఉపయోగించి సెర్చ్‌తో నేరుగా మాట్లాడేందుకు ఇది వీలు కల్పిస్తుంది. అమెరికా తర్వాత ఈ అత్యాధునిక ఫీచర్‌ను అందుకున్న తొలి దేశం భారత్ కావడం విశేషం. ఉదాహరణకు, కొన్ని వస్తువులను కెమెరాతో చూపిస్తూ, వాటిని ఎలా ఉపయోగించాలో వాయిస్ ద్వారా అడిగితే తక్షణమే సమాధానం లభిస్తుంది.

‘సెర్చ్ లైవ్’ ఫీచర్ బుధవారం నుంచే దశలవారీగా విడుదలవుతోందని, గూగుల్ యాప్ లేదా గూగుల్ లెన్స్‌లోని 'లైవ్' ఐకాన్‌పై నొక్కి దీనిని ఉపయోగించుకోవచ్చని గూగుల్ సూచించింది. భారత్‌లో సెర్చ్ అనుభవాన్ని మరింత సహజంగా, సులభంగా మార్చే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌లు అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. 
Google AI
Google
AI Search
Telugu
Indian Languages
Gemini Model
Search Live
Google App
Google Lens
Artificial Intelligence

More Telugu News