పవన్‌తో ఫైట్.. రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. ఆ ఆఫర్‌పై మల్లారెడ్డి ఏమన్నారంటే?

  • పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
  • విలన్ పాత్ర కోసం తనను సంప్రదించారని చెప్పిన మాజీ మంత్రి
  • రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారన్న మల్లారెడ్డి  
  • విలన్‌గా నటించడం ఇష్టం లేక ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్‌ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డిని సంప్రదించినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ పాత్ర కోసం తనకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లారెడ్డి, ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. దర్శకుడు హరీశ్‌ శంకర్ నేరుగా తన కాలేజీకి వచ్చి కలిశారని, దాదాపు గంటపాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని విలన్ పాత్ర గురించి వివరించారని తెలిపారు. అంతేకాకుండా ఈ పాత్రలో నటిస్తే రూ.3 కోట్ల పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే, తాను ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు.

విలన్ పాత్ర తనకు అంత సౌకర్యవంతంగా అనిపించలేదని, అందుకే నటించలేనని హరీశ్ శంకర్‌కు చెప్పినట్లు ఆయన వివరించారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ, "సినిమాలో ఇంటర్వెల్ వరకు నేను హీరోను తిడుతూ ఉంటాను. ఆ తర్వాత హీరో నన్ను తిట్టి కొడతాడు. అలాంటి నెగటివ్ రోల్ చేయడం నాకు ఇష్టం లేదు" అని మల్లారెడ్డి అన్నారు.

మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఆయన చెప్పిన పాత్ర స్వభావాన్ని బట్టి, ఇది తమిళంలో విజయ్ నటించిన ‘తేరి’ సినిమాకు రీమేక్ అయి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఆ చిత్రంలో విలన్ పాత్ర కూడా దాదాపు ఇలాగే ఉంటుందని, దాని ఆధారంగానే హరీశ్‌ శంకర్ కథను సిద్ధం చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్, హరీశ్‌ కాంబినేషన్‌లో వస్తుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. "ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది" అంటూ ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.


More Telugu News