IVF Calf: పశుపోషణలో కొత్త విప్లవం.. కృష్ణా జిల్లాలో పుట్టిన తొలి టెస్ట్ ట్యూబ్ దూడ

Krishna District Farmer Jonnalagadda Hanuma Kumar Achieves IVF Calf Success
  • కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఐవీఎఫ్ పద్ధతిలో దూడ జననం
  • పశుసంవర్థక శాఖ అధికారుల ప్రయోగం విజయవంతం
  • గిర్ ఆవు అండం, ఒంగోలు ఆబోతు వీర్యంతో పిండం సృష్టి
  • దేశీ ఆవు గర్భంలో పిండాన్ని ప్రవేశపెట్టి విజయం
  • రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద దేశీ జాతుల అభివృద్ధికి కృషి
  • పాల ఉత్పత్తి గణనీయంగా పెంచడమే లక్ష్యమన్న అధికారులు
పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) టెక్నాలజీ ద్వారా ఓ కోడెదూడ జన్మించింది. మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పశువైద్య అధికారులు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దేశీయ గో జాతులను అభివృద్ధి చేసి, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ప్రయోగం జరిగిందిలా..
పశుగణాభివృద్ధి విభాగం అధికారులు గుంటూరు లాంఫాంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మేలురకానికి చెందిన గిర్ జాతి ఆవు నుంచి అండాలను, ఒంగోలు జాతి ఆబోతు నుంచి వీర్యాన్ని సేకరించారు. వీటిని ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి పిండాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం, చినముత్తేవి గ్రామానికి చెందిన రైతు జొన్నలగడ్డ హనుమకుమార్‌కు చెందిన ఆరోగ్యవంతమైన దేశీయ ఆవు గర్భంలో ఈ పిండాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. తొమ్మిది నెలల ఐదు రోజుల తర్వాత సోమవారం ఈ ఆవు ఆరోగ్యవంతమైన కోడెదూడకు జన్మనిచ్చింది.

ఒకే ఆవుతో 60 దూడలు
ఈ ప్రయోగం వెనుక ఉన్న లక్ష్యాలను పశుసంవర్థక శాఖ ఏడీ నాగభూషణం, భట్లపెనుమర్రు పశువైద్యాధికారి విజయకుమార్ వివరించారు. "సాధారణ పద్ధతిలో ఒక ఆవు తన జీవితకాలంలో 8 నుంచి 10 దూడలకు మాత్రమే జన్మనిస్తుంది. కానీ, ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా మేలైన జన్యువులున్న ఒక ఆవు నుంచి అండాలు సేకరించి, వాటి ద్వారా 50 నుంచి 60 వరకు దూడలను పొందే అవకాశం ఉంది" అని వారు తెలిపారు.

"రాష్ట్రీయ గోకుల్ మిషన్"లో భాగంగా దేశీయ గోజాతి అభివృద్ధి కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టి సఫలీకృతులయ్యామని అధికారులు వెల్లడించారు. ఈ పద్ధతి వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని, భవిష్యత్తులో కేవలం ఆడ దూడలు మాత్రమే పుట్టేలా చేసే ప్రయోగాలు కూడా పురోగతిలో ఉన్నాయని వారు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈ విజయం పశుపోషణలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
IVF Calf
Jonnalagadda Hanuma Kumar
Krishna District
Test tube calf
IVF technology
Gir breed
Ongole breed
Artificial insemination
Livestock development
Dairy farming
Gokul Mission

More Telugu News