సొంతూరులో ధనుష్ సందడి... గ్రామస్తులకు విందు!

  • ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడ్లీ కొట్టు మూవీ ఘన విజయం
  • స్వగ్రామంలోని కరుప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ధనుష్
  • గ్రామస్తులకు మాంసాహార విందు ఏర్పాటు చేసిన ధనుష్
  • సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్ తన స్వగ్రామమైన తేని జిల్లా శంకాపురంలో సందడి చేశారు. గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశారు. ఆయన తాజా చిత్రం "ఇడ్లీ కడై" (తెలుగులో ఇడ్లీ కొట్టు) ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన సొంతూరును సందర్శించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. తమిళనాట బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయం సందర్భంగా ధనుష్ తన తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు మరియు సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి శంకాపురంలోని కరుప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం, గ్రామ ప్రజలందరికీ మాంసాహార విందును ఏర్పాటు చేసిన ధనుష్, వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ అభిమాన నటుడిని దగ్గరగా చూసి ఆనందపరవశులయ్యారు. గ్రామ ప్రజలతో కలిసి ధనుష్ సాధారణ వ్యక్తిలా మమేకమవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడైనా తన మూలాలను మరచిపోకుండా సాదాసీదాగా తన గ్రామానికి వచ్చి, గ్రామస్తులతో కలిసి పూజలు చేయడం, భోజనం చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధనుష్‌ను చూసి చాలా మంది ఎంతో నేర్చుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 


More Telugu News