డబ్బులు ఎగ్గొట్టారు .. సొంత ఇల్లు లేదు: నటుడు మహేశ్ విట్టా!

  • నటుడిగా మహేశ్ విట్టాకి గుర్తింపు 
  • 'ఫన్ బకెట్' ఆదుకుందని వెల్లడి 
  • అప్పుడు జ్ఞానోదయమైందని వ్యాఖ్య 
  • 'బిగ్ బాస్' అనుభవం పనికొచ్చిందని వివరణ
   

నటుడు మహేశ్ విట్టా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. అందువలన చాలామందికి అతను సుపరిచితమే. తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ విట్టా మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. "మాది ప్రొద్దుటూరు. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. అందువల్లనే 'బీటెక్' పూర్తి కాగానే ఇండస్ట్రీకి వచ్చాను. ఆ సమయంలో నన్ను ఆదుకున్నది 'ఫన్ బకెట్' అని చెప్పాడు. 
     
"నేను ఒక ప్రోగ్రామ్ చేస్తూ కాలం గడుపుతున్నప్పుడు, 'అరేయ్ అది అనుకోకుండా ఆగిపోతే ఏం చేస్తావు?" అని అడిగాడు. అప్పుడు నేను ఆలోచన చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఒక వర్క్ ను మాత్రమే నమ్ముకోకుండా అవకాశాల కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాను. ఒకటి ఆగిపోయినా మరొకటి ఉందికదా అనే ఒక భరోసా ఇప్పుడు ఉంది. అలా ఎవరైనా ఏదైనా ఒక విలువైన విషయాన్ని చెబితే పాటిస్తాను" అని అన్నాడు. 

"నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైంది. ఇంతవరకూ ఊళ్లోగానీ .. హైదరాబాదులో గాని సొంత ఇల్లు లేదు. నేను చేసిన సినిమాలకి సంబంధించిన చాలా ప్రొడక్షన్ హౌస్ లు డబ్బులు ఎగ్గొట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే సగం మంది డబ్బులు ఎగ్గొట్టినవాళ్లే. నేను ఇంకా సొంత ఇల్లు కొనుక్కోలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనని చెప్పాలి. అలాంటి వాళ్లను ఏమైనా అంటే, వచ్చే అవకాశాలు కూడా రావేమో అనే భయంతో మౌనంగా ఉండిపోవలసి వచ్చింది. ఇంత ఓపికగా ఉండటానికి కారణం 'బిగ్ బాస్ హౌస్'లో నేను సంపాదించిన అనుభవమే" అని చెప్పాడు. 



More Telugu News