బెంగళూరులో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం

  • కర్ణాటక పర్యటనకు వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
  • జస్టిస్ గోపాల గౌడ అమృత మహోత్సవంలో పాల్గొనేందుకు రాక
  • బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న పవన్
  • పవన్‌కు స్వయంగా స్వాగతం పలికిన జస్టిస్ గోపాల గౌడ
  • ఆహ్వానం పలికిన వారిలో కోలార్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరు చేరుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ నిర్వహిస్తున్న అమృత మహోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించిన జస్టిస్ గోపాల గౌడ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు కోలార్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. మల్లేశ్ బాబు, కర్ణాటక శాసనసభ మాజీ ఉప సభాపతి ఎం. కృష్ణా రెడ్డి కూడా ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. వీరితో పాటు అనితా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్. యుధిష్ఠర, లియో క్లబ్ ఆఫ్ మార్గ అధ్యక్షుడు నవీన్ జి కృష్ణ తదితరులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో జస్టిస్ వి. గోపాల గౌడ అమృత మహోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకే పవన్ కల్యాణ్ బెంగళూరు వచ్చారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా చింతామణిలో జరిగే కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.


More Telugu News