అమెరికాలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు హైదరాబాదీ యువకుల మృతి

  • షికాగోలో రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడ వాసి షెరాజ్‌ మరణం
  • డల్లాస్‌లో కాల్పుల్లో మీర్‌పేటకు చెందిన చంద్రశేఖర్ దుర్మరణం
  • కుమారులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలు
  • మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వ సహాయం కోరుతున్న తల్లిదండ్రులు  
అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలుగు యువకుల వరుస మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. డల్లాస్‌లో దుండగుడి కాల్పుల్లో మీర్‌పేటకు చెందిన పోలే చంద్రశేఖర్ మరణించిన వార్త తెలిసి 48 గంటలు గడవక ముందే, మరో హైదరాబాదీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. షికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడకు చెందిన షెరాజ్‌ మెహతాబ్‌ మొహమ్మద్‌ (25) దుర్మరణం పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే... ఆదివారం ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని ఈవెన్‌స్టన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో షెరాజ్‌ అక్కడికక్కడే మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ వార్త తెలియగానే ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత అవకాశాల కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఇలా విగతజీవిగా మారాడంటూ షెరాజ్‌ తండ్రి అల్తాఫ్‌ మొహమ్మద్‌ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మూడు రోజుల క్రితం డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో మీర్‌పేట టీచర్స్‌ కాలనీకి చెందిన పోలే చంద్రశేఖర్‌ (27) మృతిచెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో బీడీఎస్‌ పూర్తి చేసి, ఎండీఎస్‌ చదివేందుకు 2023లో అమెరికా వెళ్లిన చంద్రశేఖర్, ఆరు నెలల క్రితమే కోర్సు పూర్తిచేశారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, డల్లాస్‌లోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి విధుల్లో ఉండగా, ఓ గుర్తుతెలియని నల్లజాతీయుడు వచ్చి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు యూఎస్ అధికారులు చంద్రశేఖర్ తల్లిదండ్రులకు తెలిపారు.

జగన్మోహన్‌, సునీత దంపతుల చిన్న కుమారుడైన చంద్రశేఖర్ మరణంతో మీర్‌పేటలోని వారి నివాసంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడి మృతి వెనుక జాత్యహంకార దాడి ఉండి ఉండవచ్చని అతని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. 

రెండు కుటుంబాలు తమ కుమారుల భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు మరణించడంతో అమెరికాలోని తెలుగు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.


More Telugu News