ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు

  • వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
  • కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ స్కీంను పూర్తిగా వినియోగించుకోవాలని ఆదేశం
  • రైతులను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో అనుసంధానించాలని సూచన
  • సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగింతపై పరిశీలన
  • రాష్ట్రంలో ఆక్వా కల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు
  • 175 నియోజకవర్గాల్లోని ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు
రాష్ట్రంలో వ్యవసాయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా, రైతులను నేరుగా పారిశ్రామిక రంగానికి అనుసంధానించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పూర్వోదయ స్కీం'ను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ అనుబంధ రంగాలలో రాష్ట్ర రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్, మైక్రో ఇరిగేషన్ రంగాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, సంప్రదాయ పంటలతో పాటు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. "కేవలం పంటలు పండించడమే కాదు, పండించిన ఉత్పత్తులకు విలువ జోడింపు (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా వాటి మార్కెట్ పరిధిని విస్తృతం చేయాలి. తద్వారా రాష్ట్రాభివృద్ధికి ఈ రంగాలు మరింతగా దోహదపడతాయి" అని ఆయన స్పష్టం చేశారు. 

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి, ఎగుమతులకు అనుకూలంగా ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, మన వాతావరణానికి అనుకూలమైన కొత్త పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వివరించారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రోత్సాహం

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలన్నా, పంట నష్టం జరగకుండా ఉండాలన్నా ప్రతి రైతునూ ఏదో ఒక పరిశ్రమతో అనుసంధానించడమే సరైన మార్గమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్య సాధనలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓ) పాత్ర అత్యంత కీలకమని, వాటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్పీఓలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా అండగా నిలుస్తోందని గుర్తుచేశారు. 

ఉద్యాన రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మధ్య సమన్వయం కోసం త్వరలోనే ఒక ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలని సూచించారు. అన్ని ఉత్పత్తులకు నాణ్యతా ధృవీకరణ (సర్టిఫికేషన్), ట్రేసబులిటీ వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

డ్వాక్రా సంఘాలకు పశువుల షెడ్ల నిర్వహణ

గ్రామీణ స్థాయిలో పాల ఉత్పత్తిని పెంచేందుకు, పశుపోషణను ఒక పరిశ్రమగా మార్చేందుకు క్లస్టర్ల వారీగా సామూహిక పశువుల షెడ్లు నిర్మించాలని సీఎం సూచించారు. ఈ షెడ్ల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించే ప్రతిపాదనను పరిశీలించాలని ఆదేశించడం ఈ సమావేశంలో మరో కీలక పరిణామం. 

ఈ షెడ్లతో పాటే పాల ఉత్పత్తి, శీతలీకరణ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. పశు సంపదను పెంచుతూ, వ్యాధుల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆక్వా సాగును రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, దీనికి అనుగుణంగా రాష్ట్రంలో ఆక్వా కల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 175 ఎంఎస్ఎంఈ పార్కులలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయం మరియు అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News