మహిళల వరల్డ్ కప్ లో నేడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్... ఇక్కడా నో షేక్ హ్యాండ్

  • పురుషుల జట్టు విధానాన్నే అనుసరించిన హర్మన్‌ప్రీత్ సేన
  • పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం
  • టాస్ సమయంలో దూరంగానే ఉన్న ఇరుజట్ల కెప్టెన్లు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అంతకుమించి అన్నది మరోసారి రుజువైంది. ఇటీవల పురుషుల ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం (షేక్ హ్యాండ్) చేసేందుకు భారత జట్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని భారత మహిళల జట్టు కూడా కొనసాగించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 'నో షేక్ హ్యాండ్‌' విధానాన్ని పాటించింది.

టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకున్న అనంతరం, ఇద్దరు కెప్టెన్లు తమ ఇంటర్వ్యూలు ముగించుకుని నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లిపోయారు. ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న రాజకీయ సంబంధాలు, ముఖ్యంగా పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాయి.

ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో ఫైనల్‌తో సహా మూడుసార్లు పాకిస్థాన్‌తో తలపడిన భారత జట్టు, ఒక్కసారి కూడా వారితో చేతులు కలపలేదు. చివరికి, టోర్నీ విజేతగా నిలిచినా.. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు కూడా నిరాకరించింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించింది.

ఇక ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల ప్రదర్శన భిన్నంగా ఉంది. తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించి భారత్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా, బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. ఇప్పటివరకు ఈ రెండు జట్లు వన్డేల్లో 11 సార్లు తలపడగా, అన్ని మ్యాచుల్లోనూ భారత జట్టే విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తమ అజేయ రికార్డును కొనసాగించాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ తుది జట్లలో ఒక్కో మార్పు చేశాయి. భారత్ జట్టులోకి అమన్‌జోత్ కౌర్ స్థానంలో పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ రాగా, పాకిస్థాన్ జట్టులో ఒమైమా సొహైల్ స్థానంలో సదాఫ్ షమాస్‌కు అవకాశం కల్పించారు.


More Telugu News