బీహార్ ఎన్నికల వేళ బురఖాపై వివాదం

  • బురఖాలో వచ్చే మహిళలను వెరిఫై చేయాల్సిందేనన్న బీజేపీ
  • ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ ఎన్నికల సంఘానికి డిమాండ్
  • బీజేపీ నేతలవి విద్వేష రాజకీయాలంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ ఫైర్
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ లో బురఖాపై వివాదం నెలకొంది. ఓటు వేసేందుకు బురఖాలో వచ్చే మహిళలను ఓటర్ కార్డులోని ఫొటోతో సరిపోల్చుకోవాలని బీజేపీ చేసిన డిమాండ్ పై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (ఎస్ఐఆర్) చేపట్టి ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన నేపథ్యంలో బురఖాపై అభ్యంతరం చెప్పడం అర్థరహితమని వాదిస్తున్నారు. విద్వేష రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.

అసలు ఏం జరిగిందంటే..
అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బీహార్ లో ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ బీహార్ చీఫ్ దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఓటు వేయడానికి బురఖాలో వచ్చే మహిళలను ఓటర్ కార్డులోని ఫొటోతో సరిపోల్చుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లను అరికట్టేందుకు ఇది తప్పనిసరిగా చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు.

దిలీప్ జైస్వాల్ వ్యాఖ్యలపై ఆర్జేడీ తరఫున మీటింగ్ కు హాజరైన ఎంపీ అభయ్ కుశ్వాహా అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ డిమాండ్ అర్థరహితమని, రాజకీయ కుట్ర అని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే నిర్వహించిందని గుర్తుచేశారు. తాజా ఫొటోతో ఓటర్ కార్డులను జారీ చేసిన నేపథ్యంలో బురఖాలో వచ్చే మహిళలను కార్డులోని ఫొటోతో సరిపోల్చుకోవాల్సిన అవసరం లేదని అభయ్ కుశ్వాహా వాదించారు.


More Telugu News