గాయపడ్డ సహచరుడిని వదిలేసి పారిపోయిన మావోయిస్టులు... కాపాడిన పోలీసులు

  • బాంబు పెడుతుండగా పేలి మావోయిస్టుకు తీవ్ర గాయాలు
  • ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన
  • గాయపడ్డ మావోయిస్టు తుపాకీ తీసుకుని పారిపోయిన సహచరులు
  • గ్రామస్థుల సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకోవడానికి అమరుస్తున్న బాంబే ప్రమాదవశాత్తు పేలడంతో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, గాయపడిన అతడిని కాపాడాల్సింది పోయి, ఇతర మావోయిస్టులు అతడి ఆయుధాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, స్థానిక గ్రామస్తుల సాయంతో అతడిని పోలీసులు కాపాడారు. 

వివరాల్లోకి వెళితే, మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండెపార అటవీ ప్రాంతంలో శనివారం కొందరు మావోయిస్టులు శక్తివంతమైన ఐఈడీని అమర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అది ముందే పేలిపోయింది. ఈ పేలుడులో మావోయిస్టు గుజ్జా సోధి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని సహచరులు అతడిని అక్కడే వదిలేసి, అతని వద్ద ఉన్న 12 బోర్ ఆయుధాన్ని తీసుకుని పారిపోయారు.

ఈ ఘటనను గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన మద్దెడ్ పోలీసులు, గ్రామస్థుల సహాయంతో క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి, బీజాపూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స కొనసాగుతోంది. గాయపడిన గుజ్జా సోధి గత ఆరు, ఏడు సంవత్సరాలుగా మద్దెడ్ ఏరియా కమిటీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని, ఏసీఎం కన్నా బుచ్నాతో కలిసి పనిచేసేవాడని పోలీసులు గుర్తించారు.

ఈ సంఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు, మావోయిస్టు సంస్థలో మానవత్వానికి స్థానం లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అనారోగ్యంతో లేదా గాయాలతో ఉన్న సభ్యులను అడవుల్లో వదిలేసి చనిపోయేలా చేయడం వారికి అలవాటేనని తెలిపారు. ఉన్నతస్థాయి నేతల మధ్య అంతర్గత విభేదాలు, కిందిస్థాయి కేడర్‌పై నిర్లక్ష్యం కారణంగా సంస్థ బలహీనపడుతోందని విశ్లేషించారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే యువతకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని జిల్లా పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. బస్తర్ డివిజన్‌లో ఇటీవల 103 మంది మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


More Telugu News