ప్రభాస్ 'ది రాజా సాబ్' డబ్బింగ్ పనులు ప్రారంభం.. సంక్రాంతికి రావడం పక్కా!

  • సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం
  • మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
  • సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల
  • పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మాణం
  • కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్
రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఒక కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగానే డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ముగ్గురు కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బొమ్మన్ ఇరానీ, సప్తగిరి, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.


More Telugu News