Gangadhar: వ్యక్తిని చంపేసి, భార్యగా నటించి.. రూ.5 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దారుణం

Karnataka Gang Arrested in Gangadhar Insurance Fraud Case
  • కర్ణాటకలో సంచలనం సృష్టించిన వ్యక్తి హత్య
  • అసలు భార్య ఎంట్రీతో బయటపడ్డ నిజం
  • 24 గంటల్లోనే హంతక ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించిందో ముఠా.. అనంతరం ఆ వ్యక్తి భార్యనంటూ ముఠా సభ్యురాలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసింది. అయితే, అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ ముఠా ప్రయత్నం బెడిసికొట్టింది. పెరాలసిస్ కారణంగా తన భర్త శరీరంలో ఎడమవైపు భాగం పనిచేయడంలేదని, అతడు వాహనం నడపడం సాధ్యం కాదని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

కర్ణాటకలో జరిగిన ఈ దారుణం వివరాలు.. హోస్పేటకు చెందిన గంగాధర్ (34) తన పేరు మీద రూ.5 కోట్లకు బీమా చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసి ఓ ముఠా పక్కాగా ప్లాన్ వేసి గంగాధర్ ను అంతమొందించింది. ఆపై గంగాధర్ మృతదేహాన్ని శివార్లలోకి తీసుకెళ్లి టీవీఎస్ స్కూటర్ పై కూర్చోపెట్టి కారుతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ముఠాకు చెందిన మహిళ బీమా డబ్బుల కోసం తానే గంగాధర్ భార్యనంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడంటూ సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గంగాధర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శారదమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వాహన ప్రమాదంలో గంగాధర్ చనిపోయాడని పోలీసులు చెప్పగా.. శారదమ్మ సందేహం వ్యక్తం చేశారు. తన భర్త పెరాలసిస్ బారిన పడ్డారని, కోలుకున్నాక శరీరంలో ఎడమవైపు భాగం పనిచేయడంలేదని వివరించారు. అలాంటి వ్యక్తి టూవీలర్ నడపడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముఠా పన్నిన కుట్రను ఛేదించారు. 24 గంటల్లోనే ముఠా సభ్యులందరినీ అరెస్టు చేశారు.
Gangadhar
Insurance fraud
Karnataka
Murder for insurance
Road accident death
Hosapete
Insurance claim
Crime news
Fake wife
Accident investigation

More Telugu News