Chittoor gang rape case: మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్టు .. నిందితులకు పోలీస్ మార్క్ పనిష్‌మెంట్ ఇలా

Chittoor Gang Rape Case Three Arrested Police Give Unique Punishment
  • చిత్తూరులో బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం
  • నిందితులకు నేరచరిత్ర ఉందన్న డీఎస్పీ
  • బాధితులు ఫిర్యాదు చేస్తే వివరాలు గోప్యంగా ఉంచి నిందితులను శిక్షిస్తామన్న డీఎస్పీ
  • నిందితులను కోర్టులో హజరపర్చిన పోలీసులు
  • ఈ నెల 17వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
చిత్తూరులోని మురకంబట్టు టౌన్ పార్క్‌లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. నిందితులను పోలీస్ మార్క్ ట్రీట్మెంట్‌తో అవమానపరిచేలా చేశారు.

ముగ్గురు నిందితులకు బేడీలు వేసి, చెప్పులు తీయించి స్థానిక డీపీవో కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకూ ప్రజలందరికీ కనిపించేలా కిలోమీటరు మేర నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. న్యాయస్థానంలో నిందితులను హాజరుపర్చగా, న్యాయమూర్తి వారికి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

వివరాల్లోకి వెళితే.. గత నెల 25న మురకంబట్టులోని పార్క్‌లో ఓ బాలిక తన స్నేహితుడితో కలిసి ఉండగా, వారి వద్దకు మహేశ్, కిశోర్, హేమంత్ ప్రసాద్‌లు వెళ్లారు. తొలుత మహేశ్ ఆ యువకుడితో ఉన్న బాలికను తన సెల్ ఫోన్‌తో వీడియో తీశాడు. అనంతరం వారు బాలిక స్నేహితుడిని నిర్బంధించి, బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలిక స్నేహితుడి వద్ద ఉన్న బంగారు వస్తువులను లాక్కుని వెళ్లిపోయారు.

అయితే, ఆ ఘటన జరిగిన రోజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 29వ తేదీన పార్క్ వద్ద బాధిత యువకుడు, అతని స్నేహితులు, బంధువులు నిందితులను గుర్తించి దేహశుద్ధి చేయగా, వారు పరారయ్యారు. అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి బాలికపై అత్యాచారం జరిగిందని తెలియడంతో ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి పోక్సో కేసు నమోదు చేశారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం డీఎస్పీ సాయినాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ బృందాలు రాష్ట్రంలోని పలు ప్రదేశాలతో పాటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో చిత్తూరు నగర శివారులోని చెన్నమగుడిపల్లె వద్ద నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పేర్కొన్న ఆయన.. నిందితులకు నేర చరిత్ర ఉందని తెలిపారు. గతంలోనూ ఒంటరిగా ఉన్న ప్రేమజంటల వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి, అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. వారి ఫోన్లలో ఇలాంటి వీడియోలు నాలుగైదు ఉన్నాయని చెప్పారు. బాధితులు ఎవరైనా తమను సంప్రదించాలని, వారి వివరాలు రహస్యంగా ఉంచి నిందితులపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. 
Chittoor gang rape case
Chittoor
gang rape
minor girl
police punishment
arrests
Pocso case
crime news
Andhra Pradesh

More Telugu News