Auto Drivers Scheme: 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం.. నేడే ఖాతాల్లోకి రూ.15 వేలు

Auto Drivers Seva Scheme Andhra Pradesh rs 15000 deposited today
  • ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం
  • 'ఆటో డ్రైవర్ల సేవలో' పేరుతో సరికొత్త పథకం
  • అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రూ.15 వేల చొప్పున అందజేత
  • రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మందికి పైగా లబ్ధి
  • నేడు విజయవాడలో సీఎం చేతుల మీదుగా పథకం ప్రారంభం
రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా నిలుస్తూ 'ఆటో డ్రైవర్ల సేవలో' అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీని ద్వారా అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమ గిరాకీ గణనీయంగా తగ్గిపోయిందని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో స్పందించిన చంద్రబాబు, డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, దసరా పండుగ సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు.

విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లో గల మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,90,669 మంది డ్రైవర్లను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరి ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.436 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ పథకం కింద అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 22,955 మంది డ్రైవర్లు ప్రయోజనం పొందనున్నారు. సొంతంగా వాహనం కలిగి, దానిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Auto Drivers Scheme
Chandrababu
Andhra Pradesh
AP government
Free bus travel
Financial assistance
Pawan Kalyan
Nara Lokesh
Vijayawada
Taxi drivers

More Telugu News