TCS: అమెరికన్లను తొలగించి విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తారా?: టీసీఎస్‌పై అమెరికా సెనేటర్ల ఆగ్రహం

TCS Facing US Senator Anger Over Job Cuts and H1B Visas
  • 9 ప్రశ్నలతో లేఖ రాసిన సెనేటర్లు చార్లెస్ ఈ గ్రాస్లే, జె. డర్బిన్
  • టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృతి వాసన్‌కు లేఖ
  • అమెరికాలో ఉద్యోగులు దొరకడం లేదా అని విమర్శలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)పై అమెరికా సెనెటర్లు చార్లెస్ ఈ గ్రాస్లే, జె. డర్బిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలో ఉద్యోగులను తొలగిస్తూ, వేలాదిమంది హెచ్-1బీ వీసాదారులను నియమించుకోవడానికి పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ మేరకు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృతి వాసన్‌కు వారు లేఖ రాశారు. అమెరికాలో టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరును వారు విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 12 వేల మందిని తొలగిస్తున్నట్లు టీసీఎస్ ఇటీవల ప్రకటించింది. తొలగింపునకు గురవుతున్న వారిలో అమెరికన్‌లు కూడా ఉన్నారు. జాక్సన్‌విల్లేలోని కార్యాలయంలో దాదాపు 60 మంది అమెరికన్ ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది.

టెక్ పరిశ్రమలో కొన్ని ఆందోళనకర ధోరణులను గుర్తించామని, ఇది కలవరపెడుతోందని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో సాంకేతిక రంగంలోని నిరుద్యోగిత రేటు మొత్తం నిరుద్యోగిత రేటు కంటే ఎక్కువగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి 5,505 హెచ్-1బీ వీసాదారులను నియమించుకోవడానికి టీసీఎస్ ఆమోదం పొందిందని వారు గుర్తుచేశారు. నైపుణ్యం కలిగిన అమెరికన్ ఉద్యోగులు టీసీఎస్‌కు దొరకడం లేదంటే తాము నమ్మలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.

అమెరికాలో టీసీఎస్ సంస్థ అనుసరిస్తున్న నియామక ప్రక్రియ గురించి వివరాలను వారు కోరారు. అమెరికా ఉద్యోగులను హెచ్-1బీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారా? అమెరికా ఉద్యోగులకు చెల్లించే వేతనాన్నే విదేశీ ఉద్యోగులకు కూడా చెల్లిస్తున్నారా? ఆమోదం పొందిన వీసాల్లో ఎంతమంది ఔట్ సోర్సింగ్ కింద ఇతర కంపెనీల్లో పనిచేస్తున్నారు? వంటి తొమ్మిది ప్రశ్నలను ఆ లేఖలో వారు సంధించారు. దీనిపై అక్టోబర్ 10లోపు సమాధానం ఇవ్వాలని వారు కోరారు.
TCS
Tata Consultancy Services
H-1B Visa
Charles Grassley
Dick Durbin
Krithi Krithivasan
US Senator

More Telugu News