Ram Gopal Varma: ఈ సినిమా చూసి దేశంలోని ఫిలింమేకర్లు అందరూ సిగ్గుపడాలి: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Praises Kantara Chapter 1
  • ‘కాంతార: చాప్టర్ 1’చిత్రంపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
  • రిషబ్ శెట్టి నటుడా, దర్శకుడా తేల్చుకోలేకపోతున్నా అన్న వర్మ
  • సౌండ్, కెమెరా, వీఎఫ్ఎక్స్ చూసి మాటలు రాలేదని వెల్లడి
  • కంటెంట్ బోనస్ లాంటిది.. కష్టానికే బ్లాక్‌బస్టర్ అవ్వాలని వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి బృందం పడిన కష్టం చూసి భారతీయ సినీ దర్శకనిర్మాతలంతా సిగ్గుపడాలంటూ వ్యాఖ్యానించారు.

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వర్మ, ‘కాంతార’ విషయంలో మాత్రం పూర్తిగా పాజిటివ్‌గా స్పందించారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్ కోసం రిషబ్ శెట్టి, అతని బృందం పెట్టిన ఊహకందని కష్టం చూశాక భారతీయ ఫిల్మ్ మేకర్స్ అంతా సిగ్గుపడాలి” అని వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రతిభను వర్మ ఆకాశానికెత్తేశారు. “రిషబ్ శెట్టి.. నువ్వు గొప్ప నటుడివో లేక గొప్ప దర్శకుడివో నేను తేల్చుకోలేకపోతున్నాను” అంటూ ఆయన పనితీరును మెచ్చుకున్నారు. కేవలం వారు పడిన కష్టానికే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని, ఇక కంటెంట్ అనేది బోనస్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఇంతటి సృజనాత్మక బృందానికి అండగా నిలిచిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను కూడా వర్మ ప్రత్యేకంగా అభినందించారు.

 వర్మ ట్వీట్ పై హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. వర్మకు కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేక పిక్ పోస్టు చేసింది.
Ram Gopal Varma
Kantara Chapter 1
Rishab Shetty
Hombale Films
Indian cinema
Film making
Movie review
Sound design
Cinematography
VFX

More Telugu News