ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

  • ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు
  • జనవరి 27 నుంచే ప్రాక్టికల్ పరీక్షలు 
  • ముందస్తు ప్రణాళిక కోసమే షెడ్యూల్ ప్రకటించినట్లు బోర్డు వెల్లడి
  • అవసరమైతే తేదీల్లో మార్పులు ఉండొచ్చని స్పష్టీకరణ
  • అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి టైమ్‌టేబుల్ 
ఆంధ్రప్రదేశ్‌లో 2026 సంవత్సరంలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు (BIEAP) శుక్రవారం ప్రకటించింది. విద్యార్థులు పరీక్షలకు ముందుగానే ప్రణాళికతో సన్నద్ధమయ్యేందుకు వీలుగా ఈ షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగుతాయి.

విడుదల చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24న మొదలవుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ గ్రూపులకు సంబంధించిన పూర్తి సబ్జెక్టుల వారీగా టైమ్‌టేబుల్‌ను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేయనున్నట్లు బోర్డు తెలిపింది. జనరల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. వొకేషనల్ కోర్సుల వారికి మాత్రం జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. వొకేషనల్ ప్రాక్టికల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో ఆదివారాలతో సహా నిర్వహిస్తామని పేర్కొంది. 

అయితే, ఇది కేవలం తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పష్టం చేశారు. ప్రభుత్వ సెలవులు లేదా ఇతర కారణాల వల్ల తేదీలలో మార్పులు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించారు.


More Telugu News