అమెరికాలో షట్‌డౌన్.. నిలిచిపోయిన హెచ్-1బీ వీసాల జారీ.. భారతీయుల వీసాలపై ప్రభావం!

  • అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్.. నిలిచిపోయిన సేవలు
  • హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియకు తీవ్ర ఆటంకం
  • నిధుల కొరతతో కార్మిక శాఖ కార్యకలాపాల బంద్
  • కొత్త వీసాలు, ఉద్యోగ బదిలీలపై తీవ్ర ప్రభావం
  • ఇప్పటికే ఎల్‌సీఏ ఆమోదం పొందిన వారికి మినహాయింపు
అమెరికాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన నిధుల కేటాయింపుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. దీని ఫలితంగా అత్యవసరం కాని వందలాది ప్రభుత్వ కార్యాలయాలు మూతపడగా, హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది.

షట్‌డౌన్ ముగిసే వరకు కొత్త హెచ్-1బీ వీసాల దరఖాస్తులను ప్రాసెస్ చేయడం సాధ్యం కాదని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా తెలిపారు. హెచ్-1బీ వీసా ప్రక్రియలో మొదటి, కీలకమైన దశ అయిన లేబర్ కండిషన్ అప్లికేషన్ (ఎల్‌సీఏ)ను కార్మిక శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, కార్మిక శాఖ కార్యకలాపాలు కాంగ్రెస్ నిధులపై ఆధారపడి నడుస్తాయి. షట్‌డౌన్ కారణంగా ఈ విభాగానికి నిధులు నిలిచిపోవడంతో వీసాలకు సంబంధించిన అన్ని పనులను ఆపేసింది.

ఈ పరిణామంపై నికోల్ గునారా స్పష్టతనిస్తూ, "ప్రభుత్వ షట్‌డౌన్ ప్రారంభం కావడానికి ముందే ఎవరికైతే లేబర్ కండిషన్ అప్లికేషన్ (ఎల్‌సీఏ) ఆమోదం పొందిందో, వారు మినహా మిగతా ఎవరూ కొత్తగా హెచ్-1బీ వీసా పొందడం, ఉద్యోగం మారడం లేదా వీసా స్టేటస్ మార్చుకోవడం వంటివి చేయలేరు. ఎల్‌సీఏ ఆమోదం లేని వారు ప్రభుత్వం తిరిగి తెరుచుకునే వరకు వేచి చూడాల్సిందే" అని వివరించారు.

అయితే, వీసా ప్రక్రియలోని తర్వాతి దశ అయిన హెచ్-1బీ పిటిషన్‌ను స్వీకరించే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) మాత్రం ఫీజుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దాంతో దాని సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆమె తెలిపారు.

భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులైన ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాలపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఇటీవలే ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాలపై వార్షిక ఫీజును భారీగా పెంచడంతో పాటు లాటరీ విధానాన్ని రద్దు చేసి వేతనాల ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రతిపాదించడం గమనార్హం.

మరోవైపు, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. "నిధుల కొరత ఉన్నప్పటికీ, అమెరికాతో పాటు విదేశాల్లోని రాయబార కార్యాలయాల్లో పాస్‌పోర్ట్, వీసా సేవలు ప్రస్తుతానికి కొనసాగుతాయి" అని ఆ ప్రకటనలో పేర్కొంది.


More Telugu News