Ramakrishna Yadav: కడప వన్‌టౌన్‌ సీఐగా రామకృష్ణ యాదవ్ పునర్నియామకం .. రాజకీయ దుమారంతో తిరిగి అదే స్థానానికి..

Ramakrishna Yadav Reappointed as Kadapa One Town CI
  • కడప వన్ టౌన్ సీఐగా మళ్లీ నియమితులైన రామకృష్ణ యాదవ్
  • బదిలీపై అలజడితో తిరిగి యథాస్థానానికి 
  • వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన రామకృష్ణ యాదవ్
కడప వన్‌టౌన్ సీఐ రామకృష్ణ యాదవ్‌ను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రామకృష్ణ యాదవ్‌కు వీఆర్ నుండి విముక్తి లభించింది. ఆయనను యథాస్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్. మాధవీ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు వైసీపీ కీలక నేతలను నిందితులుగా చేర్చడంతో, కొన్ని నిమిషాల వ్యవధిలోనే సీఐ రామకృష్ణ యాదవ్‌ను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.

వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినందుకే ఆ అధికారిని వీఆర్‌కు పంపడం ఏమిటంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో వీఆర్‌కు పంపబడిన కడప వన్‌టౌన్ సీఐ రామకృష్ణ యాదవ్‌ను తిరిగి అదే స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలల తరబడి వీఆర్‌లోనే ఉండిపోయిన రామకృష్ణ యాదవ్‌ను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా వీఆర్‌కు పంపడంపై తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే ఆయనకు వీఆర్ నుండి విముక్తి లభించి తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇవ్వడంపై వారు ఊరట చెందుతున్నారు. 
Ramakrishna Yadav
Kadapa
Kadapa One Town CI
VR
Telugu Desam Party
TDP
MP Madhavi Reddy
YCP
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Police

More Telugu News