Mithun Reddy: మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు: లావు శ్రీకృష్ణదేవరాయులు

Mithun Reddys hypocritical dramas will not last says Lavu Sri Krishna Devarayalu
  • జైలు నుండి విడుదలయ్యాక నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడని విమర్శ
  • ప్రజల జీవితాలను మద్యం కుంభకోణం దెబ్బతీసిందని మండిపాటు
  • 30 వేల మహిళల తాళిబొట్లు తెగిపోవడం విషాదకరమని వ్యాఖ్య
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మిథున్ రెడ్డి జైలు నుండి విడుదలైన తర్వాత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, ఇది విడ్డూరమని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లావు శ్రీకృష్ణదేవరాయులు విమర్శించారు. ఆయన కపట నాటకాలు ఇక సాగవని అన్నారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవితాలను దెబ్బతీసిన మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, ఈ కుంభకోణంలో వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెగిపోవడం వంటి విషాదకర పరిణామాలు రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయాయని అన్నారు.

జగన్ ప్రభుత్వం కాలంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం గురించి యావత్ దేశం ఇప్పటికే తెలుసుకుందని, ఈ వ్యవహారంలో ప్రతి దశలోనూ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అనేక వర్గాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. మద్యం పాలసీ రూపకల్పన నుండి సరఫరా ఆర్డర్లు మలచడం, కంపెనీల నుండి లంచాలు వసూలు చేయడం, వాటిని తాడేపల్లి కేంద్రానికి మళ్లించడం వంటి అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు.

ముఖ్యంగా కొన్ని సంస్థలకు మాత్రమే ప్రత్యేక ఆర్డర్లు ఇవ్వడం, బంగారం, నగదు రూపంలో లాభాలు పొందడం, హవాలా నెట్‌వర్క్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం వంటివి మద్యం కుంభకోణం యొక్క తీవ్రతను చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అదాన్ డిస్టిలరీస్ వంటి సంస్థలతో సంబంధం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తోందని అన్నారు.

ప్రజల రక్తం, చెమటతో వచ్చిన సొమ్మును కుంభకోణాల ద్వారా దోచుకోవడమే కాకుండా, విషపూరిత మద్యం విక్రయించి బలహీనవర్గాలను దెబ్బతీసిన చరిత్ర మిథున్ రెడ్డిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుండి సానుభూతి పొందేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
Mithun Reddy
Lavu Sri Krishna Devarayalu
Andhra Pradesh
liquor scam
TDP
Jagan government

More Telugu News