PM Modi: వ్యక్తిత్వ వికాసంతోనే దేశ నిర్మాణం.. అదే ఆర్ఎస్ఎస్ మార్గం: ప్రధాని మోదీ

PM Modi says Nation Building Through Personality Development is RSS Way
  • ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
  • వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణానికి పాటుపడే సంస్థ అని కొనియాడిన ప్రధాని
  • 'నేను' నుంచి 'మనం' వైపు నడిపించే స్ఫూర్తిదాయక సంస్థగా అభివర్ణన
  • సంఘ్ పై ఎన్నో కుట్రలు జరిగినా ఎదుర్కొని నిలబడిందని వ్యాఖ్య
  • వ్యక్తిత్వ నిర్మాణానికి శాఖలు పవిత్ర వేదికలని కితాబు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనేది కేవలం ఒక సంస్థ కాదని, వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణానికి పాటుపడే ఒక మహోన్నత శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 'నేను' అనే అహాన్ని వీడి 'మనం' అనే సామూహిక భావన వైపు నడిపించే స్ఫూర్తిదాయక ప్రయాణమే సంఘ్ అని ఆయన అభివర్ణించారు.

ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ కు ఎన్నో అనుబంధ సంస్థలు ఉన్నప్పటికీ, వాటన్నింటి లక్ష్యం ఒకటేనని, అదే 'జాతికే ప్రథమ స్థానం' అని స్పష్టం చేశారు. ఏ రెండు అనుబంధ సంస్థల మధ్య వైరుధ్యాలు ఉండవని ఆయన పేర్కొన్నారు.

సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దేశ నిర్మాణం అనే బలమైన సంకల్పాన్ని తీసుకున్నారని మోదీ గుర్తుచేశారు. ప్రతి పౌరుడిలో దేశం పట్ల బాధ్యత పెరిగినప్పుడే దేశం బలోపేతం అవుతుందని ఆయన విశ్వసించారని తెలిపారు. అందుకే వ్యక్తి వికాసానికి ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. నేటికీ సంఘ్ శాఖల్లో ఈ వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియ కనిపిస్తుందని, ఇవి శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదలకు దోహదపడే పవిత్ర వేదికలని ప్రధాని అన్నారు.

స్వాతంత్య్ర సంగ్రామంలో డాక్టర్ హెడ్గేవార్ సహా ఎందరో సంఘ్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారని మోదీ గుర్తు చేశారు. స్వాతంత్య్రానంతరం కూడా సంఘ్ పై అనేక దాడులు, కుట్రలు జరిగాయని ఆయన అన్నారు. సంస్థను అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని, కానీ వాటన్నింటినీ సంఘ్ ఎదుర్కొని నిలబడిందని తెలిపారు. ఎన్ని కుట్రలు పన్నినా స్వయంసేవకులు ఎన్నడూ ద్వేషానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
PM Modi
Narendra Modi
RSS
Rashtriya Swayamsevak Sangh
Dr Hedgewar
nation building
personality development
India
Delhi
RSS Centenary Celebrations
Indian Independence Movement

More Telugu News