iBomma: మీరు మాపై ఫోకస్ చేస్తే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది: పోలీసులకు 'ఐబొమ్మ' వార్నింగ్

Hyderabad Police Face Challenge From iBomma Piracy Website
  • టాలీవుడ్‌ను ముంచేస్తున్న పైరసీ
  • ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామన్న సీవీ ఆనంద్
  • పోలీసుల హెచ్చరికలపై స్పందించిన ఐబొమ్మ
తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు, ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే తాము కూడా పోలీసులపై దృష్టి పెట్టాల్సి వస్తుందంటూ బహిరంగంగా హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.

ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC), ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

సీపీ చేసిన ఈ హెచ్చరికలపై ఐబొమ్మ నిర్వాహకులు స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. "మీరు మాపై ఫోకస్ చేస్తే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది" అంటూ పోలీసులకే ఎదురు వార్నింగ్ ఇచ్చారు.

పైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. థియేటర్లలో రహస్యంగా చిత్రీకరించడం, డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్లను దొంగిలించడం వంటి పద్ధతుల్లో ఈ ముఠాలు పనిచేస్తున్నాయని వివరించారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా వీరికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, ఈ లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ రూపంలో జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.

నిర్మాతలను బెదిరించిన పైరసీ సైట్లు ఇప్పుడు ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. 
iBomma
iBomma piracy
Telugu film industry
CV Anand
Hyderabad police
TFCC
piracy websites
cyber crime
cryptocurrency
movie piracy

More Telugu News