Donald Trump: నాకు నోబెల్ బహుమతి ఇవ్వకుంటే అది అమెరికాకే తీవ్ర అవమానం.. తేల్చేసిన ట్రంప్

Donald Trump claims he resolved 7 conflicts deserves Nobel
  • ఇప్పటికే ఏడు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానన్న డొనాల్డ్ ట్రంప్
  • గాజా వివాదం కూడా దాదాపు పరిష్కారమైనట్టేనని వెల్లడి
  • ఇజ్రాయెల్, అరబ్ దేశాలు ఒప్పందానికి అంగీకరించాయని వ్యాఖ్య
  • ఏమీ చేయని వారికే నోబెల్ బహుమతి ఇస్తారంటూ కమిటీపై విమర్శలు
  • ఒప్పందాల గురించి తన కంటే ఎవరికీ బాగా తెలియదన్న ట్రంప్  
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏడు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించకపోతే అది అమెరికాకు జరిగిన పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మంగళవారం క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా గాజా వివాద పరిష్కార ప్రణాళిక గురించి ట్రంప్ ప్రస్తావించారు. "మేం ఆ సమస్యను పరిష్కరించాం, అది దాదాపు సెటిల్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో" అన్నారు. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్‌తో పాటు అన్ని అరబ్, ముస్లిం దేశాలు అంగీకరించాయని, కేవలం హమాస్ మాత్రమే అంగీకరించాల్సి ఉందని వివరించారు. ఒకవేళ హమాస్ ఒప్పుకోకపోతే వారికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. "ఇది ఒక అద్భుతమైన విషయం. అన్నీ వాటంతట అవే కుదిరాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.

గాజా ప్రణాళిక కూడా విజయవంతమైతే, తాను కొన్ని నెలల వ్యవధిలోనే మొత్తం ఎనిమిది అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించినట్టు అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది చాలా గొప్ప విషయమని, చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఇలా చేయలేదని అన్నారు. అయినప్పటికీ తనకు నోబెల్ బహుమతి వస్తుందా అంటే ‘అస్సలు రాదు’ అని ఆయనే బదులిచ్చారు. "ఏమీ చేయని వాళ్లకే ఆ అవార్డు ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ మనసు గురించి, యుద్ధాన్ని పరిష్కరించడానికి ఏం చేశాడనే దాని గురించి పుస్తకం రాసిన రచయితకు నోబెల్ బహుమతి వెళ్తుంది" అంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు.

అయితే, ఏం జరుగుతుందో వేచి చూస్తానని అన్నారు. "నిజం చెప్పాలంటే నాకు వ్యక్తిగతంగా ఆ బహుమతి అక్కర్లేదు. అది మన దేశానికి రావాలి. ఎందుకంటే మనం సాధించింది అసాధారణమైనది. ఒప్పందాల గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. నా జీవితమంతా వాటిపైనే ఆధారపడి ఉంది. గాజాతో కలుపుకుని ఎనిమిది ఒప్పందాలు చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను" అని ట్రంప్ వివరించారు.
Donald Trump
Trump Nobel Prize
Nobel Peace Prize
Gaza conflict
Israel
Hamas
US Foreign Policy
International disputes
Quantico
Arab countries

More Telugu News