Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించడంలో మాకు ట్రాక్ రికార్డు ఉంది: ఢిల్లీలో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Invites Investments at CII Partnership Summit Delhi
  • ఢిల్లీలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం
  • కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో కలిసి హాజరైన సీఎం చంద్రబాబు 
  • పెట్టుబడులకు భారత్‌లో ఏపీనే బెస్ట్ అన్న సీఎం
  • నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించిన చంద్రబాబు
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అనుసరిస్తూ పరిశ్రమలకు శరవేగంగా అనుమతులు మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

నవంబరు 14, 15వ తేదీల్లో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను, వివిధ దేశాల రాయబారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నవంబరు 14, 15వ తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి, సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలం. 

ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. మేం స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశాం. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం. దీని కోసం 10 సూత్రాలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నాం. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రొడక్ట్ పర్ఫెక్షన్ లాంటి కీలకమైన లక్ష్యాలను పెట్టుకున్నాం. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పుడు ఓ నినాదం... పీ4 ద్వారా సమీకృత అభివృద్ధి సాధ్యం. స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్ సిటీలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం" అని సీఎం చెప్పారు.

2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ తదుపరి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటాం. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది. పనిచేసే యువత భారత్ కు ఉన్న అతిపెద్ద వనరు. ఇదే దేశాభివృద్ధికి కీలకం. పునరుద్పాదక విద్యుత్ రంగంలో 500 గిగావాట్లను దేశంలో ఉత్పత్తి చేయాలని నిర్దేశిస్తే...అందులో ఏపీలోనే 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నాం. 

ఏపీ సోలార్, పంప్డ్ ఎనర్జీ, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టులు చేపట్టాం. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తయారు చేస్తాం. భారత కర్బన ఉద్గారాల రహిత ప్రయాణంలో కీలక భాగస్వామిగా ఏపీ ఉంటుంది.” అని ముఖ్యమంత్రి వివరించారు.

ఇదే మాకున్న బలం!

తీర ప్రాంతంలో ప్రపంచ ప్రమాణాలతో పోర్టులు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల నిర్మాణం చేస్తున్నాం. అడ్వాన్స్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తాం, రైతులకు లబ్ధి కలిగేలా బిగ్ టెక్ కంపెనీలకు ఏపీ కీలక స్థానంగా మారుతోంది. సెమీకండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో గ్లోబల్ టెక్ పవర్ హౌస్ గా భారత్ మారుతుంది. సహజ పర్యాటక ప్రాంతాలు ఏపీకి ఉన్న అతిపెద్ద వనరు, విద్య, వైద్య రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. 

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. అమెరికా తర్వాత ఇదే రెండో అతిపెద్ద కేంద్రం అవుతుంది. ఏపీలో మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఓసారి ఏపీని సందర్శించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తున్నాను. పెట్టుబడులను ఆకర్షించటంలో మాకు ట్రాక్ రికార్డు ఉంది. ఐటీ రంగంతో హైదరాబాద్ ను అభివృద్ది చేసి అత్యుత్తమ నివాస నగరంగా మార్చాం. ప్రస్తుతం అమరావతి నగరాన్ని గ్రీన్ సిటీగా నిర్మాణం చేస్తున్నాం. అమరావతి సమీపంలో ప్రస్తుతం రోజుకు 7 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. 

కృష్ణా- గోదావరి నదులను అనుసంధానించాం. ఈ ఏడాది ఈ రెండు నదుల నుంచి 5 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ప్రపంచంలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాలు.. సుస్థిరమైన విధానాలు దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి” అని సీఎం చంద్రబాబు చెప్పారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ సహా వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Investments
Visakhapatnam
CII Partnership Summit
Piyush Goyal
Amaravati
Ease of Doing Business
AP Economy
Renewable Energy

More Telugu News