విజయ్ సభలో తొక్కిసలాట.. ఘటన స్థలాన్ని పరిశీలించిన హేమమాలిని బృందం

  • కరూర్ లో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వెళ్లిన బీజేపీ ఎంపీల బృందం
  • విజయ్ ప్రచార సభకు ఇరుకైన ప్రాంతాన్ని ఎంపిక చేయడంపై విమర్శలు
  • బాధిత కుటుంబాలతో మాట్లాడిన హేమమాలిని బృందం
తమిళనాడులోని కరూర్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనపై బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. హేమమాలిని నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. బాధిత కుటుంబాలతో మాట్లాడి, దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా విజయ్ ప్రచార సభకు ఇరుకైన ప్రాంతాన్ని ఎంపిక చేయడంపై విమర్శలు గుప్పించారు.

తొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని, ఏం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి బాధిత కుటుంబాలతో మాట్లాడామని హేమమాలిని తెలిపారు. ఏ రాజకీయ ప్రచార సభలోనూ ఇటువంటి తొక్కిసలాట సంభవించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్టార్ హీరో సభకు ఇరుకైన సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం సరికాదని ఆమె అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని ఆమె పేర్కొన్నారు.

ప్రచార సభకు విశాల ప్రాంగణాన్ని కేటాయిస్తే ఈ విషాదం జరిగేది కాదని ఆమె అన్నారు. ఇరుకైన వేదిక, కరెంట్ కట్ వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని హేమమాలిని అన్నారు. మరో ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, విజయ్ ప్రచార సభకు ఏర్పాట్లు చేయడంలో తమిళనాడు పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.


More Telugu News