Cyber Crime Police Hyderabad: సినీ ప్రముఖులతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కీలక భేటీ.. 'ఐబొమ్మ'కు షాక్‌!

Cyber Crime Police Hyderabad Meeting with Tollywood on Piracy
  • పైరసీ ముఠాల వెనుక బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల హస్తం
  • భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయబోమని హీరోల నిర్ణయం
  • రిలీజ్‌కు ముందే సర్వర్ల నుంచి హెచ్‌డీ ప్రింట్ల చోరీ
  • సైబర్ భద్రతను పెంచుతామని డిజిటల్ సంస్థల హామీ
  • భేటీకి హాజరైన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, దిల్ రాజు
  • త్వర‌లోనే ఐబొమ్మ నిర్వాహకులను ప‌ట్టుకుంటామ‌న్న పోలీసులు
తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న పైరసీ భూతం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తెలిసి సినీ ప్రముఖులు నివ్వెరపోయారు. తాము ప్రచారం చేస్తున్న బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులే పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారనే చేదు నిజం వారిని తీవ్రమైన షాక్‌కు గురి చేసింది. ఈ విషయం తెలియడంతో, భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని టాలీవుడ్ ఏకగ్రీవంగా నిర్ణయించుకుంది.

ఇటీవల భారీ పైరసీ ముఠాలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసేందుకు మంగళవారం నగరంలో సినీ పరిశ్రమ పెద్దలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, నాగచైతన్యతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, పలువురు దర్శకులు, డిజిటల్ మీడియా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీసులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పనితీరును వివరించారు. సినిమాలు థియేటర్లలోకి రాకముందే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డిజిటల్ మీడియా సంస్థల సర్వర్లలో ఉన్న బలహీనమైన సైబర్ భద్రతను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సినిమాలను దొంగిలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ హ్యాకర్లకు, పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు భారీగా డబ్బు చెల్లిస్తున్నారని ఆధారాలతో సహా వివరించారు.

ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్న డిజిటల్ మీడియా కంపెనీలు తమ సైబర్ భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేసుకుంటామని, సర్వర్ల రక్షణ కోసం మరింత ఖర్చు చేస్తామని హామీ ఇచ్చాయి. తెలుగు సినిమా పరిశ్రమను కాపాడటానికి పోలీసులు చేస్తున్న కృషిని హాజరైన సినీ ప్రముఖులందరూ మనస్ఫూర్తిగా అభినందించారు.

ఐబొమ్మకు షాక్‌!
పైర‌సీ ముఠా గుట్టుర‌ట్టు చేసిన హైద‌రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు త్వ‌ర‌లోనే ఓటీటీ పైర‌సీ కంటెంట్ సైట్ అయిన 'ఐబొమ్మ' నిర్వాహకులను ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి, అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నామ‌ని, త్వరలో 'ఐబొమ్మ' నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామ‌ని సీవీ ఆనంద్ వెల్ల‌డించారు. 
Cyber Crime Police Hyderabad
Chiranjeevi
Nagarjuna
Venkatesh
Nani
Naga Chaitanya
Dil Raju
Tollywood
iBOMMA
Movie Piracy
Betting Apps

More Telugu News