నేటి నుంచే మహిళల వన్డే వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఢీ

  • నేటి నుంచి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 
  • భారత్ వేదికగా నెల రోజుల పాటు సాగనున్న మెగా టోర్నీ
  • తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనున్న భారత జట్టు
  • భద్రతా కారణాలతో శ్రీలంకకు పాకిస్థాన్ మ్యాచ్‌ల తరలింపు
  • ఆతిథ్య నగరాల జాబితాలో విశాఖపట్నం కూడా
  • గువాహటిలో మధ్యాహ్నం 3 గంటలకు భారత్-శ్రీలంక మ్యాచ్
క్రికెట్ అభిమానులకు అసలైన పండుగ వచ్చేసింది. ఆసియా కప్ ముగిసిన వెంటనే మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీ నేడు ప్రారంభం కానుంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. అసోంలోని గువాహటి ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది.

హాట్ ఫేవరెట్‌గా భారత జట్టు 
స్వదేశంలో జరుగుతుండటంతో ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా జట్టు ఎలాగైనా కప్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. నెల రోజులకు పైగా సాగే ఈ మెగా ఈవెంట్ కోసం దేశంలోని నాలుగు ప్రముఖ స్టేడియాలు సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల అభిమానులకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే, ఈ ఆతిథ్య నగరాల జాబితాలో విశాఖపట్నం కూడా చోటు దక్కించుకుంది.

పాక్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు
ఇదిలా ఉండగా, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లన్నీ కొలంబో వేదికగా జరగనుండగా, మిగతా అన్ని మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత్-శ్రీలంక మధ్య తొలి పోరు 
ఇక తొలి మ్యాచ్ విషయానికొస్తే, గువాహటిలో మధ్యాహ్నం 3 గంటలకు భారత్-శ్రీలంక మధ్య పోరు ప్రారంభమవుతుంది. వన్డేల్లో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ఇప్పటివరకు ఆడిన 35 మ్యాచ్‌లలో టీమిండియా 31 సార్లు గెలవగా, శ్రీలంక కేవలం 3 మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. ఈ గణాంకాలు ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే అంశం. ఈ మ్యాచ్‌ను జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.


భార‌త జట్టు (అంచనా): ప్రతికా రావెల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహా రానా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.

శ్రీలంక జట్టు (అంచనా): హాసిని పెరేరా, చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), దివ్మీ విహంగ, ప్యూమీ వాత్సల, అచిని కులసూర్య, ఉదేశిక ప్రబోధని, మల్కీ మదర.

మహిళా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం వేళ బీసీసీఐ స్పెష‌ల్‌ పోస్టు
భార‌త జ‌ట్టును ప్రశంసిస్తూ బీసీసీఐ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. దానికి 'కలతోనే అన్నీ మొదలవుతాయి' అనే క్యాప్షన్ ను జోడించింది. 2 నిమిషాల 21 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో టీమిండియా ఫ్యాన్స్కు ఆకట్టుకునేలా రూపొందించారు. జట్టు సభ్యుల అరుదైన ఛైల్డ్ హుడ్ ఫొటోలనూ పొందుపరిచారు. దేశం కోసం వారు చేసిన, చేస్తున్న త్యాగాల గురించి తెలియజేశారు. భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంత పెద్ద కలో తెలిపారు. 

టోర్నీలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇలా..
  • భారత్ vs శ్రీలంక - సెప్టెంబర్ 30
  • భారత్ vs పాకిస్థాన్ - అక్టోబర్ 05
  • భారత్ vs సౌతాఫ్రికా- అక్టోబర్ 09
  • భారత్ vs ఆస్ట్రేలియా- అక్టోబర్ 12
  • భారత్ vs ఇంగ్లాండ్- అక్టోబర్ 19
  • భారత్ vs న్యూజిలాండ్ - అక్టోబర్ 23
  • భారత్ vs బంగ్లాదేశ్- అక్టోబర్ 26




More Telugu News