పెళ్లయిన 2 నెలలకే చాహల్ మోసం చేశాడు.. ధనశ్రీ

  • క్రికెటర్ యజువేంద్ర చాహల్‌తో విడాకులపై స్పందించిన ధనశ్రీ వర్మ
  • ‘రైజ్ అండ్ ఫాల్’ రియాలిటీ షోలో ఈ రహస్యాలు బయటపెట్టిన వైనం 
  • భరణం తీసుకున్నాననే పుకార్లను ఖండించిన ధనశ్రీ 
  • పరస్పర అంగీకారంతోనే విడాకులు త్వరగా జరిగాయని వెల్లడి
  • ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంతో త్వరలో టాలీవుడ్ ఎంట్రీ
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్‌తో తన వివాహ బంధంపై ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా స్టార్ ధనశ్రీ వర్మ సంచలన విషయాలు వెల్లడించారు. పెళ్లయిన రెండు నెలలకే చాహల్ తనను మోసం చేశాడని, ఆ బంధంలో మొదటి నుంచే సమస్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఆమె పాల్గొంటున్న ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షోలో ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఈ షోలో నటి కుబ్రా సైత్‌తో మాట్లాడుతూ “మీ పెళ్లి బంధం ఒక పొరపాటని ఎప్పుడు గ్రహించారు?” అని అడిగిన ప్రశ్నకు ధనశ్రీ స్పందిస్తూ, “మొదటి సంవత్సరంలోనే. ఇంకా చెప్పాలంటే రెండో నెలలోనే అతడిని పట్టుకున్నాను” అని బదులిచ్చారు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌లో డ్యాన్స్ క్లాసుల ద్వారా పరిచయమైన చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, మనస్పర్థల కారణంగా ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చిలో న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. తాను భరణం తీసుకున్నట్లు వస్తున్న పుకార్లను ఆమె ఖండించారు. “ఇది ఇద్దరి అంగీకారంతో జరిగింది కాబట్టే త్వరగా పూర్తయింది. అలాంటిది భరణం ప్రస్తావన ఎందుకొస్తుంది? నేను మాట్లాడటం లేదని ఏది పడితే అది ప్రచారం చేస్తారా?” అని ఆమె ప్రశ్నించారు.

మరో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ విడాకుల సమయంలో తాను మానసికంగా ఎంతో కుంగిపోయానని ధనశ్రీ తెలిపారు. “మేము మానసికంగా సిద్ధపడి కోర్టుకు వెళ్లినా, తీర్పు వెలువడిన వెంటనే అందరి ముందే బోరున ఏడ్చేశాను. ఆ సమయంలో నా బాధను మాటల్లో చెప్పలేకపోయాను. చాహల్ నాకంటే ముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడు” అని ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా, ధనశ్రీ వర్మ త్వరలోనే ‘ఆకాశం దాటి వస్తావా’ అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నారు. డ్యాన్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఆమె నటిస్తున్నారు.


More Telugu News