మహారాష్ట్రలో రోడ్డుపై 'ఐ లవ్ మహమ్మద్' నినాదం.. పోలీసుల లాఠీచార్జ్.. 30 మంది అరెస్ట్

  • అహల్యానగర్‌లో రోడ్డుపై ముగ్గుతో 'ఐ లవ్ మహమ్మద్' నినాదం
  •  సోషల్ మీడియాలో ఫొటో వైరల్ కావడంతో వివాదం
  •  ఒకరి అరెస్టుకు నిరసనగా ఆందోళన, పోలీసులపై రాళ్ల దాడి
  •  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీచార్జ్
  •  30 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్న వైనం
  • ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర అని సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్య
మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో (గతంలో అహ్మద్‌నగర్) రోడ్డుపై ముగ్గుతో రాసిన ఓ నినాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి, 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుతం దేవీ నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి అహల్యానగర్‌లోని మిల్లివాడ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై ముగ్గుతో పాటు ‘ఐ లవ్ మహమ్మద్’ అనే నినాదాన్ని రాశారు. దీనికి సంబంధించిన ఫొటో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా వివాదం మొదలైంది. కొందరు స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి, ఈ ఘటనకు కారణమైన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

అయితే, ఆ అరెస్టుకు నిరసనగా నిందితుడి సామాజిక వర్గానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో గుమికూడి ఆందోళన చేపట్టారు. వారికి నచ్చజెప్పి, శాంతింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టి, వారిలో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఇదే నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.


More Telugu News