టాలీవుడ్ నటి సోహానీ కుమారి కాబోయే భర్త ఆత్మహత్య

  • జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
  • చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసిన సవాయ్
  • తాను చేసిన తప్పుల వల్లే ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో వెల్లడి
టాలీవుడ్ నటి సోహానీ కుమారి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమెకు కాబోయే భర్త సవాయ్ సింగ్ (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో తాము నివాసముంటున్న ఫ్లాట్‌లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చనిపోయే ముందు తన ఆవేదనను వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేయడం ఈ ఘటనలో కీలకంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన సోహానీ కుమారి, సవాయ్ సింగ్‌లకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో గత ఏడాది జులైలో వీరి నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ప్రశాసన్ నగర్‌లోని ఒక ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు.

శనివారం (సెప్టెంబర్ 27) సాయంత్రం సోహానీ ఇంటికి తిరిగి వచ్చేసరికి డైనింగ్ హాల్‌లో సవాయ్ సింగ్ సీలింగుకి వేలాడుతూ కనిపించారు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సవాయ్ ఫోన్‌ను పరిశీలించగా, ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో లభ్యమైంది. "నేను చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను" అని ఆ వీడియోలో సవాయ్ చెప్పినట్లు తెలిసింది.

తనకంటే ముందు సవాయ్‌కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమెను మర్చిపోలేకపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహానీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సవాయ్ మాజీ ప్రియురాలిని కూడా విచారించి, ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.


More Telugu News