Yaminisharma: 5 వేలు కాదు.. 50 వేల గుళ్లు కడతాం: షర్మిలపై యామిని ఫైర్

Yaminisharma Fires on Sharmila Over Temple Construction Remarks
  • టీటీడీ ఆలయాల నిర్మాణంపై షర్మిల వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి యామినీశర్మ
  • ప్రభుత్వానికి, ధార్మిక సంస్థలకు తేడా తెలుసుకోవాలని హితవు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో దళితవాడల్లో 5 వేల ఆలయాలు నిర్మిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. షర్మిల తీరుపై బీజేపీ అధికార ప్రతినిధి యామినీశర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వానికి, భక్తులు సమర్పించే కానుకలతో నడిచే టీటీడీ వంటి ధార్మిక సంస్థకు మధ్య ఉన్న తేడాను షర్మిల ముందుగా గ్రహించాలని ఆమె చురకలంటించారు.

యామినీశర్మ మాట్లాడుతూ.. "దళితవాడల్లో 5 వేల ఆలయాల నిర్మాణం గురించి చెప్పగానే షర్మిలకు సమాజసేవ, అభివృద్ధి గుర్తుకొచ్చాయి. మేం 5 వేలే కాదు, అవసరమైతే 50 వేల ఆలయాలు నిర్మించుకుంటాం. దాని గురించి మాట్లాడటానికి మీకేం హక్కు ఉంది?" అని సూటిగా ప్రశ్నించారు. భక్తులు హుండీలో వేసిన సొమ్మును టీటీడీ ధూపదీప నైవేద్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి వినియోగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

హిందూ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ నిధులను ఏమాత్రం తీసుకోవడం లేదని, పైగా దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వమే ఆలయాల నుంచి పన్నులు వసూలు చేస్తోందని యామిని గుర్తుచేశారు. టీటీడీ ఇప్పటికే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. "సమాజంపై అంత ప్రేమ ఉంటే, ముందు మీ ఆస్తులన్నీ ప్రజలకు రాసివ్వండి" అంటూ షర్మిలకు ఆమె సవాల్ విసిరారు.

అలాగే, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) గురించి మాట్లాడే హక్కు షర్మిలకు లేదని యామిని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించిందని, వారి అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. 
Yaminisharma
YS Sharmila
BJP
Tirumala Tirupati Devasthanam
TTD
Hindu temples
Dalit
RSS
Andhra Pradesh politics

More Telugu News