Upasana Kamineni: ఢిల్లీలో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఉపాసన, సీఎం రేఖా గుప్తా

Upasana Attends Grand Bathukamma Celebrations in Delhi
  • ఢిల్లీ యూనివర్సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
  • నాలుగు వేల మందికి పైగా హాజరైన తెలుగు విద్యార్థులు, కుటుంబాలు
  • కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
  • గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కామినేని
  • సంప్రదాయాన్ని నిలబెడుతున్న యువతను అభినందించిన ఉపాసన
దేశ రాజధాని ఢిల్లీ బతుకమ్మ సంబరాలతో కళకళలాడింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే పూల పండుగను తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్ఏ) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్ జస్ కాలేజీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా హాజరై బతుకమ్మ పూజలో పాల్గొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్, స్టార్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన... ముఖ్యమంత్రితో కలిసి వేదికను పంచుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ, “బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు, మహిళా శక్తికి, సామాజిక ఐక్యతకు, సృజనాత్మకతకు అద్దం పడుతుంది. దసరా స్ఫూర్తితో ముడిపడి ఉన్న ఈ వేడుక ఉత్సాహాన్ని, విజయాన్ని సూచిస్తుంది” అన్నారు. ఢిల్లీలో తెలుగు యువత ఇంత ఘనంగా మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వంగా ఉందని ఆమె ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించినందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టీఎస్ఏ అధ్యక్షుడు వివేక్ రెడ్డి, సలహాదారు కార్తీక్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ వేడుక అద్భుతంగా జరిగింది. సంప్రదాయ పూజలు, బతుకమ్మ నృత్యాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాసనను నిర్వాహకులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. దసరా పండుగ వాతావరణంలో జరిగిన ఈ బతుకమ్మ వేడుక, ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల మధ్య ఐక్యతను, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. 
Upasana Kamineni
Upasana
Delhi Bathukamma celebrations
Bathukamma festival
Rekha Gupta
Telugu Students Association
Telangana culture
Delhi University
Ram Charan wife
Dasara festival

More Telugu News