Speed Post: స్పీడ్ పోస్ట్ చార్జీల పెంపు.. ఇకపై ఓటీపీ చెబితేనే డెలివరీ

Speed Post Charges Increased
  • అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ చార్జీల పెంపు
  • 13 ఏళ్ల తర్వాత పెరిగిన నిర్వహణ ఖర్చులతో రేట్ల సవరణ
  • ఈ-కామర్స్ తరహాలో ఓటీపీ ఆధారిత డెలివరీ సేవలు ప్రారంభం
  • డెలివరీ సమయంలో ఆన్‌లైన్ పేమెంట్లు, ఎస్సెమ్మెస్ అలర్ట్‌ల సౌకర్యం
  • విద్యార్థులకు స్పీడ్ పోస్ట్ చార్జీలపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు
దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగించే వారికి తపాలా శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. స్పీడ్ పోస్ట్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించగా, పెరిగిన కొత్త ధరలు అక్టోబర్ 1వ తేదీ (బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. అదే సమయంలో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ-కామర్స్ సంస్థల తరహాలో ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి పలు ఆధునిక సేవలను కూడా ప్రవేశపెట్టింది.

దాదాపు 13 ఏళ్ల తర్వాత స్పీడ్ పోస్ట్ చార్జీలను సవరించినట్లు తపాలా శాఖ తన ప్రకటనలో పేర్కొంది. చివరిసారిగా 2012లో రేట్లను మార్చారని, అప్పటి నుంచి నిర్వహణ వ్యయం గణనీయంగా పెరగడంతో చార్జీలను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడిందని అధికారులు వివరించారు.

ఈ చార్జీల పెంపుతో పాటు వినియోగదారులకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించేందుకు పలు కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఓటీపీ ఆధారిత డెలివరీ. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థల మాదిరిగానే ఇకపై పోస్ట్‌మ్యాన్‌కు ఓటీపీ చెబితేనే పార్సిల్‌ను డెలివరీ చేస్తారు. ఈ ప్రత్యేక సేవను పొందాలనుకునే వారు అదనంగా 5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు పార్సిల్ బుకింగ్, డెలివరీ సమయంలో ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించడం, ఎస్సెమ్మెస్ ద్వారా డెలివరీ సమాచారం తెలుసుకోవడం, రియల్ టైమ్ డెలివరీ అప్‌డేట్‌లు వంటివి కూడా ప్రారంభించింది.

అంతేకాకుండా, 'రిజిస్ట్రేషన్' పేరుతో మరో కొత్త సేవను కూడా తీసుకొచ్చింది. దీనికి 5 రూపాయలు చెల్లించడం ద్వారా, పార్సిల్‌ను తాము సూచించిన వ్యక్తికి, నిర్దేశిత చిరునామాలోనే కచ్చితంగా అందజేసేలా చూసుకోవచ్చు. ఇదిలా ఉండగా, విద్యార్థులకు ఊరటనిచ్చేలా స్పీడ్ పోస్ట్ చార్జీలపై 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పోస్టల్ శాఖ ప్రకటించింది.
Speed Post
Speed Post Charges
Postal Department
India

More Telugu News