Amit Shah: మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి వస్తే రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతాం: అమిత్ షా

Amit Shah Ready to Welcome Maoists Who Surrender
  • లొంగిపోయేందుకు వచ్చే మావోయిస్టులపై ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించబోమన్న అమిత్ షా
  • నక్సల్ రహిత భారత్ సదస్సులో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
  • వామపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు 
దేశంలో నక్సలిజం శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్న వేళ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన, వారు ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాల నుంచి ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించబోమని అమిత్ షా హామీ ఇచ్చారు.

‘నక్సల్ రహిత భారత్’పై ఢిల్లీలో నిర్వహించిన సదస్సు ముగింపు సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. ఇటీవల మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖపై స్పందిస్తూ, ‘‘ఇప్పటివరకు జరిగినది పొరపాటేనని వారు పేర్కొనడం గమనార్హం. కాల్పుల విరమణ ప్రకటించాలని, లొంగిపోవాలనుకుంటున్నామని వారు సూచించారు. కానీ లొంగిపోవాలనుకుంటే విరమణ అవసరం లేదు. ఆయుధాలు వదిలి ముందుకు రండి. స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

"ఒక్క బుల్లెట్ కూడా పేలదు" – హామీ

మావోయిస్టులు చట్టబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటే, కేంద్రం వారి పునరావాసానికి, పునర్నిర్మాణానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అభివృద్ధి లేకపోవడమే హింసకు కారణమన్న వాదనలను తోసిపుచ్చారు. ‘‘మావోయిస్టు హింస వల్లే అనేక ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి’’ అని విమర్శించారు.

వామపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు

మావోయిస్టుల హింసపై మౌనం వహిస్తూ, వారిని సిద్ధాంతపరంగా మద్దతిస్తున్న వామపక్షాలను అమిత్ షా ప్రశ్నించారు. ‘‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ప్రారంభించినప్పుడు మానవ హక్కుల పేరు చెప్పి విమర్శలు చేసేవారు, గిరిజన బాధితుల కోసం ఆగిపోయిన అభివృద్ధిని ఆ పార్టీలు ఎందుకు అడగడం లేదు ?’’ అని ప్రశ్నించారు.

2026 మార్చి 31లోపు నక్సలిజం నిర్మూలన లక్ష్యం

నక్సలిజంపై కేంద్రం చేస్తున్న చర్యలు చివరి దశలో ఉన్నాయని, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుదముట్టిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు. 
Amit Shah
Maoists
Naxalism
India
Left Wing Extremism
Surrender
Red Carpet
Naxal Free India 2026
Anti Naxal Operations

More Telugu News