Chandrababu Naidu: టీడీపీ కేడర్ తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Chandrababu Naidu Teleconference with TDP Cadre on GST
  • జీఎస్టీ ఉత్సవ్ నిర్వహణపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలకు సూచనలు
  • రాష్ట్రానికి ఆదాయం తగ్గినా ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతుందని వ్యాఖ్య
  • కేంద్రం తీసుకొచ్చిన ఈ మార్పులను ఈ మార్పులను ప్రజలకు వివరించాలని క్యాడర్కు దిశానిర్దేశం
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశం చరిత్రలోనే నూతన అధ్యాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుతుందని, అయితే, రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ కు చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ‘జీఎస్టీ ఉత్సవ్’ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని పేర్కొన్నారు. కనీసం రాష్ట్రవ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి జీఎస్టీ సంస్కరణలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమిలోని పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని ఆయన గుర్తుచేశారు.
 
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ది జరగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు మేలు జరుగుతుందన్నారు. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటి ఇంటి వస్తువుల ధరలు తగ్గుతాయని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని చెప్పారు. రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణల వల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారని వివరించారు.
 
సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చేశామో వివరించాం.. ఇప్పుడు కూడా అదే తరహాలో జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని చంద్రబాబు సూచించారు. కార్యకర్తల భాగస్వామ్యంతోనే యోగాడే సక్సెస్ అయిందని, అలాగే జీఎస్టీ ఉత్సవ్ ను కూడా సక్సెస్ చేయాలని పార్టీ కేడర్ కు చెప్పారు. కార్యకర్తలైనా.. నాయకులైనా ఎల్లప్పుడూ ప్రజలకు చేరువగా ఉండాలని, మంచి చెడులను ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే జనం హర్షించరని హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వంపై విసుర్లు..
గత ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 15 నెలల కాలంలోనే విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామని, అనేక సమస్యలను పరిష్కరించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని వివరించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విద్యుత్ కొనుగోళ్లల్లో సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామని వెల్లడించారు. ఆ మేరకు రానున్న కాలంలో ప్రజలపై రూ.1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ సహా అనేక మేనిఫెస్టో హామీలను నెరవేర్చామని, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ కు సూచించారు.
Chandrababu Naidu
TDP
GST
Andhra Pradesh
GST Utsav
AP CM
Telugu Desam Party
Electricity
YSRCP

More Telugu News