Asia Cup: ఆసియా కప్ లో తొలిసారి దాయాదుల ఫైనల్ పోరు.. దుబాయ్ స్టేడియం ఫుల్

India Pakistan Asia Cup Final Dubai Stadium Sold Out
  • ఆసియా కప్ చరిత్రలో తొలిసారి దాయాదుల మధ్య తుది సమరం
  • బాయ్ కాట్ ట్రెండ్ తో తొలి మ్యాచ్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువు
  • షేక్ హ్యాండ్ వివాదంతో రెండో మ్యాచ్ కు అంతంత మాత్రంగానే ఆదరణ
ఆసియా కప్ చరిత్రలో ఫైనల్ లో భారత్, పాక్ జట్లు తొలిసారి తలపడనుండడంతో ఈ మ్యాచ్ పై ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దుబాయ్ స్టేడియం ఇప్పటికే ఫుల్ అయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్, పాక్ జట్లు రెండుసార్లు తలపడగా.. ఆ మ్యాచ్ లకు ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే లభించింది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడవద్దని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బాయ్ కాట్ పిలుపు నేపథ్యంలో గ్రూప్ దశలో జరిగిన తొలి మ్యాచ్ కు దుబాయ్ స్టేడియంలో చాలా వరకు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

స్టేడియానికి వెళ్లి చూసిన ప్రేక్షకుల సంఖ్య 20 వేల లోపే కావడం గమనార్హం. దుబాయ్ స్టేడియంలో 28 వేల మంది ప్రేక్షకులకు సీటింగ్ సదుపాయం ఉంది. ఇక, సూపర్ 4 దశలో జరిగిన రెండో మ్యాచ్ కు ప్రత్యక్షంగా హాజరైన ప్రేక్షకుల సంఖ్య కేవలం 17 వేలు మాత్రమే. తొలి మ్యాచ్ తర్వాత జరిగిన షేక్ హ్యాండ్ వివాదం ప్రభావం రెండో మ్యాచ్ పై పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి భారత్-పాకిస్థాన్‌ తలపడనుండడం, అదికూడా ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ లో ఇరు జట్లు పోటీపడడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ స్టేడియం ఫుల్ అయిందని, మొత్తం 28 వేల టికెట్లు అమ్ముడయ్యాయని నిర్వాహకులు ప్రకటించారు.
 
ఆసియా కప్ అందించే విషయంలో వివాదం..
ఫైనల్ లో గెలిచిన జట్టుకు ఆసియా కప్ అందించే విషయంపై తాజాగా వివాదం నెలకొంది. విజేతకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ కప్ అందిస్తారని సమాచారం. అయితే, నఖ్వీ చేతుల మీదుగా కప్ అందుకోవడానికి భారత జట్టు సుముఖంగా లేదని తెలుస్తోంది. టోర్నీలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ లు ఆడుతున్నట్లు చెబుతూ వచ్చిన భారత జట్టు.. మ్యాచ్ ముగిసాక ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం చేసే సంప్రదాయాన్ని పక్కన పెట్టింది.

ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో భారత జట్టు గెలిచింది. ఆ తర్వాత మైదానంలో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. పాకిస్థాన్‌ కెప్టెన్ సల్మాన్ అఘాతో కలిసి ట్రోఫీ ఫొటోషూట్‌కే భారత్‌ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్‌లో గెలిస్తే నఖ్వీ చేతులమీదుగా ట్రోఫీని తీసుకుంటుందా.. అనే సందేహం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ అంశంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నఖ్వీతో వేదిక పంచుకోకూడదనే ఉద్దేశంలోనే భారత్‌ ఉన్నట్లు తెలుస్తోంది.
Asia Cup
India vs Pakistan
Dubai Stadium
Asia Cup Final
Mohsin Naqvi
ACC President
Cricket
Salman Agha
BCCI
Asia Cricket Council

More Telugu News