అన్ని సంగతులు డిజిటల్ బుక్ లో నమోదవుతున్నాయి: సజ్జల

  • డిజిటల్ బుక్, క్యూ ఆర్ కోడ్ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులను నమోదు చేస్తున్నామన్న సజ్జల
  • ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు ఇస్తామని వెల్లడి
  • రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందన్న సజ్జల
డిజిటల్ బుక్‌లో అన్ని విషయాలు నమోదవుతాయని వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అన్యాయ పాలన కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓట్ల తొలగింపు, వ్యవస్థలపై నియంత్రణ వంటి చర్యలు చంద్రబాబుకు సుపరిచితమని విమర్శించారు.

భవిష్యత్తులో వైకాపా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని సజ్జల పేర్కొన్నారు. రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. జగన్ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులమని తెలిపారు.

ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, బూత్ లెవెల్ నుంచి రోజువారీగా పరిశీలన చేయాలని సజ్జల సూచించారు. "వైఎస్ జగన్ పాలన ప్రజల సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకుంది. మనకు 18 లక్షల మంది కార్యకర్తల సైన్యం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నాం. డిజిటల్ బుక్, క్యూ ఆర్ కోడ్ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ప్రతీ కార్యకర్తకు గుర్తింపు కార్డులు ఇస్తాం," అని సజ్జల పేర్కొన్నారు.

ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు సమర్థంగా తిప్పికొడుతున్నారని అన్నారు. పార్టీని వచ్చే 30 ఏళ్లలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. 


More Telugu News