విజయ్ ప్రచార సభ తొక్కిసలాట.. 36కి చేరిన మృతులు, ప్రధాని మోదీ సంతాపం

  • మృతుల్లో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు
  • 40 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వెల్లడి
  • కరూర్ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి దిగ్భ్రాంతి
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 36కి పెరిగింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులతో పాటు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వారిని నియంత్రించడం కష్టమై తొక్కిసలాటకు దారితీసింది.

ఈ తొక్కిసలాటలో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు మరణించారని రాష్ట్ర మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. 40 మందికి పైగా గాయపడి కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇతర ఆసుపత్రుల నుండి వైద్యులను, ఫోరెన్సిక్ నిపుణులను కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి రప్పించినట్లు ఆయన వెల్లడించారు.

కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేస్తూ, "తమిళనాడులోని కరూర్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటన చాలా బాధాకరం. ఆప్తులను కోల్పోయిన వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.


More Telugu News