Haritha Teacher: గూడూరులో దారుణం: బంగారం కోసం టీచర్‌పై ఆటో డ్రైవర్ కత్తితో దాడి

Haritha Teacher Attacked for Gold in Guduru Nellore District
  • ఒంటరిగా ప్రయాణిస్తుండగా ఘటన
  • గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • తీవ్రగాయాలతో నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం ఓ ఆటో డ్రైవర్, పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అయితే, ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం గూడూరు అశోక్‌నగర్‌కు చెందిన హరిత (35) అనే ఉపాధ్యాయురాలు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం గొట్టికాడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం విధులకు వెళ్లేందుకు ఆమె ఆటో ఎక్కారు. మార్గమధ్యంలో ఇతర ప్రయాణికులు దిగిపోవడంతో ఆమె ఒంటరిగా మిగిలారు. ఇదే అదనుగా భావించిన ఆటో డ్రైవర్ వెంకటరమణ, చెమిర్తి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె మెడ, చేతిపై తీవ్రంగా గాయపరిచి, మెడలోని సుమారు ఒకటిన్నర సవర్ల బంగారు గొలుసు లాక్కొని, బాధితురాలిని రోడ్డు పక్కకు తోసేసి పరారయ్యాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న హరితను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గూడూరు ఏరియా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో ఉపాధ్యాయురాలు ధైర్యంగా ప్రతిఘటించడంతో నిందితుడికి కూడా గాయాలైనట్లు సమాచారం. 

విషయం తెలుసుకున్న ఏఎస్పీ సౌజన్య, డీఎస్పీ గీతాకుమారి ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు. ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు, గంటల వ్యవధిలోనే నిందితుడు వెంకటరమణను అరెస్ట్ చేశాయి. దాడికి ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Haritha Teacher
Haritha
Guduru
Nellore district
auto driver attack
gold robbery
Andhra Pradesh crime
police investigation
crime news
teacher attacked

More Telugu News