Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు

Heavy Rain Alert For Telangana And Aandhra Pradesh With Cyclone Effect
  • తీరం దాటిన వాయుగుండం 
  • తెలంగాణ, ఏపీకి రెండు రోజుల పాటు వర్ష సూచన
  • పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ
  • ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల హెచ్చరిక
  • తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడం, దానికి తోడు ద్రోణి కూడా కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో శని, ఆదివారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా శనివారం నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వంటి ఇతర జిల్లాల్లోనూ భారీ వానలు పడే సూచనలున్నాయని వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీలోనూ వాయుగుండం ప్రభావం
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటినట్లు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడనుందని పేర్కొన్నారు. దీనితో పాటు తెలంగాణ, ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మహారాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోందని, ఈ రెండింటి ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
Heavy Rain Alert
Telangana
Aandhra Pradesh
Cyclone Effect

More Telugu News