అంపైర్ ఔటిచ్చాడు, రనౌట్ కూడా అయ్యాడు.. అయినా బ్యాటర్ నాటౌట్.. ఆసియాకప్‌లో విచిత్రం!

  • ఆసియా కప్‌లో భారత్-శ్రీలంక మ్యాచ్‌లో వింత సంఘటన
  • సూపర్ ఓవర్‌లో రనౌట్ అయినా బతికిపోయిన దసున్ శనక
  • అంపైర్ క్యాచ్ ఔట్ ఇవ్వడంతో బంతి డెడ్ బాల్‌గా మారిన వైనం
  • రివ్యూలో నిర్ణయం మారడంతో చెల్లకుండా పోయిన రనౌట్
  • సూపర్ ఓవర్‌లో శ్రీలంక కేవలం రెండే పరుగులు
  • సునాయాసంగా విజయం సాధించిన టీమిండియా
ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీయగా, అందులో శ్రీలంక బ్యాటర్ దాసున్ శనక స్పష్టంగా రనౌట్ అయినా, క్రికెట్ నిబంధనల కారణంగా నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఘటన ఆటగాళ్లతో పాటు అభిమానులను కూడా తీవ్ర గందరగోళానికి గురిచేసింది.

సూపర్ ఓవర్‌లో అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తుండగా నాలుగో బంతికి ఈ డ్రామా నడిచింది. అర్షదీప్ వేసిన యార్కర్‌ను శనక ఆడటంలో విఫలమయ్యాడు. బంతి కీపర్ సంజూ శాంసన్ చేతుల్లోకి వెళ్లగా, బౌలర్ క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. అంపైర్ గాజీ సోహెల్ వేలెత్తడంతో శనక ఔటయ్యాడు. అయితే, అదే సమయంలో శనక పరుగు తీయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన శాంసన్ బంతిని నేరుగా వికెట్లకు కొట్టాడు. అప్పటికి శనక క్రీజుకు చాలా దూరంలో ఉన్నాడు.

దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిందని అంతా భావించారు. కానీ, ఇక్కడే క్రికెట్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అంపైర్ క్యాచ్ ఔట్ అని వేలెత్తిన వెంటనే బంతి 'డెడ్ బాల్'గా మారుతుంది. శనక వెంటనే ఆ నిర్ణయాన్ని రివ్యూ కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగలలేదని తేలడంతో, అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బంతి డెడ్ బాల్ అయిన తర్వాత జరిగిన రనౌట్ చెల్లదని ప్రకటించారు. దీంతో రనౌట్ ప్రమాదం నుంచి శనక అదృష్టవశాత్తూ బయటపడ్డాడు.

ఈ ఘటనపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ "అంపైర్ క్యాచ్ ఔట్ ఇచ్చిన వెంటనే బంతి డెడ్ అవుతుంది. అందుకే శనక రనౌట్ నుంచి తప్పించుకున్నాడు" అని వివరించాడు. అయితే, ఆ తర్వాతి బంతికే శనకను అర్షదీప్ ఔట్ చేయడంతో శ్రీలంక సూపర్ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే మూడు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, అభిషేక్ శర్మ (61) మెరుపు ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాతుమ్ నిస్సంక (107) అద్భుత శతకంతో చెలరేగడంతో శ్రీలంక కూడా సరిగ్గా 202 పరుగులే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారితీసింది.


More Telugu News