ఉగ్రవాదాన్ని కీర్తించడమే మీ పని.. ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్

  • ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని
  • షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్
  • పాకిస్థాన్‌ది ఉగ్రవాదాన్ని కీర్తించే విధానమంటూ ఫైర్
  • ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన విషయం గుర్తుచేసిన దౌత్యవేత్త
  • సింధు జలాల ఒప్పందం ఉల్లంఘన యుద్ధ చర్యేనన్న పాక్
  • ఉగ్రవాదం ఆపితేనే ఒప్పందం పునరుద్ధరణ అని భారత్ స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. పాక్ ప్రధాని ప్రసంగం ఓ ‘అసంబద్ధమైన నాటకం’ అని, ఉగ్రవాదాన్ని కీర్తించడం వారి విదేశాంగ విధానంలో భాగమని భారత్ ఘాటుగా బదులిచ్చింది.

శనివారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని, సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారానికి తమ మద్దతు ఉంటుందని, ఐరాస ఆధ్వర్యంలో నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం యుద్ధ చర్యతో సమానమని హెచ్చరించారు.

పాక్ ప్రధాని ప్రసంగం అనంతరం భారత్ తన ‘రైట్ ఆఫ్ రిప్లై’ హక్కును వినియోగించుకుంది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లాట్ మాట్లాడుతూ పాక్ వాదనలను తీవ్రంగా తిప్పికొట్టారు. “ఈ సభ ఉదయం పాకిస్థాన్ ప్రధాని నుంచి ఓ హాస్యాస్పద నాటకాన్ని చూసింది. వారి విదేశాంగ విధానంలో కీలకమైన ఉగ్రవాదాన్ని ఆయన మరోసారి కీర్తించారు. కానీ, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాలను దాచలేరు” అని ఆమె స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 25న జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన మారణకాండకు బాధ్యత వహించకుండా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్’ను ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్ కాపాడిందని గహ్లాట్ గుర్తుచేశారు. “ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒసామా బిన్ లాడెన్‌ను దశాబ్దకాలం పాటు తమ దేశంలో దాచిపెట్టి, ఉగ్రవాదంపై పోరాటంలో భాగస్వామిగా నటించిన దేశం అది. తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలు నడుపుతున్నామని వారి మంత్రులే ఇటీవల అంగీకరించారు. ఇప్పుడు ఆ దేశ ప్రధాని స్థాయిలోనూ అదే ద్వంద్వ నీతి కొనసాగడంలో ఆశ్చర్యం లేదు” అని ఆమె అన్నారు.

గత ఏప్రిల్‌లో పహల్గామ్‌లో 26 మంది పౌరులు ఉగ్రదాడిలో మరణించిన తర్వాత, 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందంలో భాగస్వామ్యాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది.


More Telugu News