Rains: మూసారాంబాగ్ బ్రిడ్జి మీద నుంచి మూసీ ప్రవాహం.. బ్రిడ్జి మూసివేత

Moosarambagh Bridge closed
  • ఉస్మాన్ సాగర్ నిండడంతో దిగువకు నీటి విడుదల
  • బ్రిడ్జి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు
  • దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు మళ్లింపు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నారు.

నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లేవారు, పనుల కోసం బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేగంబజార్, కోఠి, నాంపల్లి, హిమయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ మొదలైన ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద నీరు గంట గంటకు పెరుగుతుండటంతో రెండు జలాశయాల గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీనితో పురానాపూల్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Rains
Rain In Hyderabad
Bridge

More Telugu News