Pawan Kalyan: అలా అయితే ఆ ధర ఉన్నప్పుడే సినిమా చూడాలి: 'ఓజీ' చిత్రం టిక్కెట్ ధరలపై హైకోర్టులో వాదనలు

Pawan Kalyan OG Ticket Price Arguments in High Court
  • సినిమా టిక్కెట్ రేట్లపై కొంతమందికే అభ్యంతరం ఉందన్న న్యాయవాది
  • సినిమా టిక్కెట్ ధరలను ప్రభుత్వం రెగ్యులరేట్ చేస్తుందన్న న్యాయవాది
  • రూ. 150 కూడా కష్టం అనుకుంటే సాధారణ ధర ఉన్నప్పుడే సినిమా చూడాలన్న న్యాయవాది
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన 'ఓజీ' సినిమా టిక్కెట్ ధరలపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. 'ఓజీ' చిత్రం యూనిట్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సినిమా టిక్కెట్ ధరలపై కొద్దిమంది మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆయన కోర్టుకు తెలియజేశారు. టిక్కెట్ ధరలపై అభ్యంతరం ఉన్నవారు సాధారణ ధరలు ఉన్నప్పుడే సినిమా చూడవచ్చని ఆయన అన్నారు.

కోర్టులో వాదనలు వినిపిస్తూ, ఒక 5-స్టార్ హోటల్‌లో కాఫీ ధర రూ. 500 ఉంటుందని, గాయకుడు దిల్జీత్ ప్రదర్శన టిక్కెట్ ధర వేలల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ ధరలను నిర్ణయించే అధికారం నిర్వాహకులకే ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ షో ఏర్పాటు చేయాలనుకుంటే, ఆయనకు నచ్చిన ధరను నిర్ణయిస్తారని అన్నారు. సినిమా టిక్కెట్ ధరలను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆయన తెలిపారు.

'ఓజీ' చిత్రాన్ని ఢిల్లీలో చూడాలంటే టిక్కెట్ ధర రూ. 1,500 ఉంటుందని, అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్ ధర కూడా రూ. 1,500 ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ధరలు రూ. 200 ఉండాలని కోరుతూ పిటిషనర్ కోర్టుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దిల్జిత్ షో టిక్కెట్ ధర రూ. 10 వేలు ఉంటే, దానిని రూ. 200కు తగ్గించాలని ఎందుకు పిటిషన్ వేయలేదని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో వాదించారు.

కేవలం సినిమా టిక్కెట్ ధరలపై మాత్రమే ఇలాంటి పిటిషన్‌లు వేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సినిమా టిక్కెట్ ధరల గురించి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే, రూ. 100, రూ. 150 వరకు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఆయన తెలిపారు. పిటిషనర్‌కు రూ. 150 కూడా ఎక్కువ అనిపిస్తే, సాధారణ ధర ఉన్నప్పుడే సినిమా చూడవచ్చని పేర్కొన్నారు. పిటిషనర్ మొదటి రోజు, తమకు నచ్చిన ధరకే సినిమా చూడాలనుకుంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
Pawan Kalyan
OG Movie
OG Ticket Prices
Telangana High Court
Niranjan Reddy Advocate
Movie Ticket Rates

More Telugu News