Telangana Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. తెలంగాణకు రెండ్రోజుల వర్ష సూచన

Hyderabad Rains City Flooded Telangana Issues Rain Alert
  • హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
  • నిన్న‌ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన
  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం
  • రాష్ట్రానికి రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన
  • శనివారం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గురువారం రాత్రి మొదలైన వాన ఈ రోజు ఉదయం కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, జనజీవనం స్తంభించిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఎల్బీనగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోఠి, మొజంజాహీ మార్కెట్‌ పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అల్పపీడన ప్రభావంతో కుండపోత
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరం మీదుగా విదర్భ వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వాతావరణ శాఖ రానున్న రెండ్రోజులకు సంబంధించి పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఇక, శనివారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అప్రమత్తమైన ప్రభుత్వం
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
Telangana Rains
Hyderabad Rains
Rain Alert
Heavy Rainfall
Weather Forecast
Revanth Reddy
Telangana Weather
GHMC
Hyderabad Weather
Orange Alert

More Telugu News