Suryakumar Yadav: సూర్యకుమార్‌కు వార్నింగ్.. పాక్ ఆటగాళ్లకూ తప్పని విచారణ

Suryakumar Yadav appears before ICC told not to make political statements Pak players also summoned
  • రాజకీయ వ్యాఖ్యలపై కెప్టెన్ సూర్యకుమార్‌కు ఐసీసీ వార్నింగ్
  • విచారణ కమిటీ ముందు హాజరైన భారత కెప్టెన్
  • పాక్‌పై గెలుపును ఉగ్రదాడి బాధితులకు అంకితమిచ్చిన సూర్య
  • పీసీబీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఐసీసీ
  • అనుచిత సైగలపై ఇద్దరు పాక్ ఆటగాళ్లకూ సమన్లు
  • భారత్ ఫిర్యాదుతో పాక్ క్రికెటర్ల విచారణ
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి హెచ్చరిక ఎదురైంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం చేసిన రాజకీయ వ్యాఖ్యల విషయంలో ఆయన గురువారం ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు విచారణకు హాజరయ్యాడు. భవిష్యత్తులో అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఇలాంటి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయవద్దని కమిటీ ఆయనకు స్పష్టంగా సూచించినట్లు సమాచారం.

దుబాయ్‌లో ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల‌ 21న పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, ఈ గెలుపును పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నామని, అలాగే 'ఆపరేషన్ సిందూర్' గురించి కూడా ప్రస్తావించాడు. క్రీడాస్ఫూర్తిని మించినవి కొన్ని ఉంటాయని సూర్య‌ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ జరిగింది. బీసీసీఐ అధికారులు హేమాంగ్ అమిన్, సుమీత్ మల్లాపూర్కర్ కూడా సూర్యకుమార్‌తో పాటు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్పులను చూపించగా, ఆ వ్యాఖ్యలు తాను చేసినవేనని సూర్య అంగీకరించినట్లు తెలిసింది.

"ప్రతి ఒక్కరూ రాజకీయాలు మాట్లాడటం ప్రారంభిస్తే, పరిస్థితిని అదుపు చేయడం కష్టమవుతుంది" అని ఐసీసీ కమిటీ సూర్యకుమార్‌కు వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో, మ్యాచ్ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం కూడా ఉద్రిక్తతలకు అద్దం పట్టింది.

ఇదిలా ఉండగా, భారత్ చేసిన ఫిర్యాదు మేరకు ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా విచారణను ఎదుర్కోనున్నారు. సూపర్‌-4 మ్యాచ్ సందర్భంగా అనుచిత, రాజకీయ సైగలు చేశారని ఆరోపిస్తూ సాహిబ్జాదా ఫర్హాన్, హరీస్ రవూఫ్‌లపై బీసీసీఐ ఫిర్యాదు చేసింది. బ్యాట్‌తో తుపాకీ పేల్చినట్లు ఫర్హాన్, విమానం కూలినట్లు రవూఫ్ సంజ్ఞ‌లు చేయడం వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఉన్నందున వారు నిన్న‌ విచారణకు హాజరుకాలేదని, ఈ రోజు కమిటీ ముందు హాజరవుతారని తెలిసింది.
Suryakumar Yadav
ICC
Pakistan cricket
Asia Cup
Pahalgam attack
Operation Sindoor
Sahibzada Farhan
Haris Rauf
BCCI
cricket controversy

More Telugu News