Jagapathi Babu: సాహితీ ఇన్ ఫ్రా కేసులో నటుడు జగపతిబాబును విచారించిన ఈడీ

Jagapathi Babu Questioned by ED in Sahiti Infra Case
  • జగపతిబాబును 4 గంటలు ప్రశ్నించిన ఈడీ అధికారులు
  • ఈ సంస్థ యాడ్స్ లో నటించిన  జగపతిబాబు
  • సాహితీ ఇన్ ఫ్రా అక్రమాలకు పాల్పడిందని ఈడీ ఆరోపణ
టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ ఫ్రా కేసులో భాగంగా, అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఈడీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది.

దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ విచారణలో, జగపతిబాబు గతంలో సాహితీ ఇన్ ఫ్రా సంస్థ యాడ్స్ లో నటించ అంశంపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆ సంస్థ ప్రకటనల్లో నటించినందుకు గాను ఆయనకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై వివరాలు సేకరించినట్టు సమాచారం. ఆ లావాదేవీల గురించి కూపీ లాగినట్లు తెలుస్తోంది.

ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షించిన సాహితీ ఇన్ ఫ్రా, సుమారు 700 మంది నుంచి రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో భాగంగా, మోసం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన రూ.161 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.

గతంలో ఎలాంటి వివాదాల్లోనూ పేరు వినిపించని జగపతిబాబును ఈడీ విచారించడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ప్రకటనల్లో నటించినందుకే ఆయన్ను సాక్షిగా విచారించారా లేక మరేదైనా కోణం ఉందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Jagapathi Babu
Sahiti Infra case
ED investigation
Enforcement Directorate
Tollywood actor
Brand ambassador
Financial fraud
Money laundering
Real estate scam
Telugu cinema

More Telugu News