'ఓజీ' దెబ్బకు ఓవర్సీస్ షేక్.. ప్రీమియర్లతోనే అరుదైన రికార్డు!

  • ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన 'ఓజీ'
  • నార్త్ అమెరికాలో ప్రీమియర్లతోనే సంచలనం
  • 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన వసూళ్లు
  • ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

నార్త్ అమెరికాలో 'ఓజీ' అరుదైన ఘనత సాధించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 కోట్లు) మార్కును చేరుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఈ మేర‌కు ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది.  

 తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. పవన్ కల్యాణ్ మాస్ యాక్షన్ అవతార్, సుజీత్ టేకింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలవడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్‌ను పూర్తిస్థాయి మాస్ పాత్రలో చూడటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా 'ఓజీ' వైబ్‌తో నిండిపోయింది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ విలన్‌గా నటించగా, ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా న‌టించారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి వారు కీలక పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ఓజీ' తన హవాను కొనసాగిస్తోంది.




More Telugu News