పాక్‌పై వ్యాఖ్యలు.. సూర్యకుమార్‌ను దోషిగా తేల్చిన మ్యాచ్ రిఫరీ.. వేటు తప్పదా?

  • పాక్‌పై గెలుపును సైన్యానికి అంకితమిచ్చిన సూర్యకుమార్ యాదవ్
  • సూర్య వ్యాఖ్యలపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
  • స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు విరుద్ధమంటూ నివేదిక ఇచ్చిన మ్యాచ్ రిఫరీ
  • సూర్యకుమార్‌ను దోషిగా తేలుస్తూ బీసీసీఐకి ఈ-మెయిల్
  • తప్పు ఒప్పుకుంటే జరిమానా.. లేదంటే అధికారిక విచారణ
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన గెలుపు తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేయడంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇవి కొనసాగుతుండగానే ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాడు. అంతేకాకుండా, పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి భారత జట్టు నిరాకరించింది.

సూర్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను పీసీబీ తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యాఖ్యలు 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్'కు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఐసీసీకి రెండు వేర్వేరు ఫిర్యాదులు చేసింది. ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఐసీసీ, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌ను నియమించింది. విచారణ చేపట్టిన రిచర్డ్సన్.. సూర్యకుమార్ వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ఆయన బీసీసీఐకి ఒక ఈ-మెయిల్ పంపినట్లు ‘దైనిక్ జాగరణ్’ పత్రిక తన కథనంలో పేర్కొంది.

ప్రస్తుతం సూర్యకుమార్ ముందు రెండు దారులు ఉన్నాయి. తాను చేసిన తప్పును అంగీకరిస్తే మ్యాచ్ రిఫరీ రిచర్డ్సన్ శిక్షను ఖరారు చేస్తారు. అలా కాకుండా, తన వ్యాఖ్యలను సమర్థించుకుంటే మాత్రం ఐసీసీ అధికారిక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీకి రిచర్డ్సన్ నేతృత్వం వహించనుండగా, పీసీబీ అధికారులు కూడా ఇందులో భాగం కానున్నారు.

సూర్యకుమార్‌పై నిషేధం ఉంటుందా?
ఐసీసీ నిబంధనల ప్రకారం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం లెవెల్ 1 నేరం కిందకు వస్తుంది. ఆటగాళ్లను గానీ, అంపైర్లను గానీ బెదిరించడం, బాల్ ట్యాంపరింగ్ వంటివి లెవెల్ 3, 4 తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలు లెవెల్ 1 నేరం కిందకే వచ్చే అవకాశం ఉన్నందున, అతనిపై నిషేధం విధించే అవకాశాలు తక్కువ. బహుశా, మ్యాచ్ ఫీజులో కొంత కోత విధించి వదిలేయవచ్చని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News